Heart Palpitations : గుండె దడ.. మనల్ని వేధించే గుండె సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. గుండె దడ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ సమస్య తలెత్తడానికి ముఖ్యమైన కారణాల్లో ఆందోళన ఒకటి. భయానకమైన వాటిని చూసినా, ఒత్తిడికి గురి అయినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా ఆల్కాహాల్ ను ఎక్కువగా తీసుకున్నా కూడా గుండె దడ సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా కాఫీ తాగే వారిలో ఈ కూడా మనం ఈ సమస్యను చూడవచ్చు. కాఫీలో ఉండే కెఫిన్ కు గుండె వేగాన్ని పెంచే లక్షణం ఉంటుంది. కనుక కాఫీ ఎక్కువగా తాగే వారు ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది.
జ్వరం బారిన పడినప్పుడు కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. అదేవిధంగా శరీరంలో థైరాయిడ్ స్థాయిలు పెరిగిన కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారిలో కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తం తక్కువగా ఉండడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో గుండె వేగంగా కొట్టుకుని శరీరానికి తగినంత ఆక్సిజన్ ను అందిస్తుంది. ఈ గుండె దడ సమస్య నుండి బయటపడాలంటే ముందుగా గుండె దడ సమస్య ఎందుకు తలెత్తిందో గుర్తించాలి. టెన్షన్ ను తగ్గించడానికి మందులు వాడడం, ఆల్కాహాల్ నపు తక్కువగా తీసుకోవడం, కాఫీకి దూరంగా ఉండడం, థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం, రక్తహీనతకు సంబంధించిన మందులను వాడడం వంటివి చేయడం వల్ల మనం గుండెదడను తగ్గించుకోచ్చు.
అయితే కొందరిలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నా కూడా గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె దడతో పాటు ఈ లక్షణాలు ఉన్నట్టయితే గుండెదడను ప్రమాదంగా భావించాలి. గుండె జబ్బు ఉన్న వారు ప్రశాతంగా ఉన్నప్పటికి ఒకేసారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటే కూడా దీనిని ప్రమాదకరంగా భావించాలి. గుండె దడతో పాటు కొందరిలో ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. అలాంటి వారిలో కూడా గుండె దడను తేలికగా తీసుకోకూడదు. గుండెదడ రావడంతో పాటు కొందరు కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరం.
ఈ లక్షణాలు కనుక కనిపించినట్టయితే వెంటనే కార్డియాలజిస్ట్ ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. సాధారణ కారణాల వల్ల గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనం గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించవచ్చు. స్వరపేటికకు ఎడమ వైపున మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం ఉంటుంది. ఆ రక్తనాళం పైన సున్నితంగా మర్దనా చేయడం వల్ల కూడా గుండెదడను తగ్గించుకోవచ్చు. అలాగే కళ్లు మూసుకుని రెండు కళ్ల పైన రెండు చేతులను ఉంచి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. గుండెదడ సమస్య తలెత్తినప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.