Thunder : వర్షం పడేటప్పుడు పిడుగులు పడడం సహజం. ఈ పిడుగులు ఎక్కడ తమ మీద పడతాయో అని చాలా మంది భయపడుతుంటారు. ప్రతి సంవత్సరం పిడుగుపాటుతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా పిడుగులు పడడం ఎక్కువైందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అసలు పిడుగు అంటే ఏమిటి.. అది ఎలా పుడుతుంది.. పిడుగు మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకాశంలో ఒక మేఘం మరో మేఘంతో ఢీ కొట్టినప్పుడు ఏర్పడే విద్యుత్ ఘాతాన్ని మెరుపు అంటారు. ఆ సమయంలో పెద్ద శబ్దాలు కూడా వస్తాయి. మెరుపు, ఉరుము ఒకేసారి సంభవిస్తాయి. అయితే కాంతి వేగం ధ్వని వేగం కంటే ఎక్కువ కావడంతో ముందు మెరుపు మనకు కనబడి తరువాత ఉరుము వినబడుతుంది. మేఘాల్లో ధనావేశ కణాలు, రుణావేశ కణాలు అనే రెండు రకాల కణాలు ఉంటాయి. ధనావేశ కణాలు తేలికగా ఉంటాయి. కనుక ఇవి మేఘం పై భాగంలో ఉంటాయి. బరువుగా ఉన్న రుణావేశ కణాలు కింది భాగంలో ఉంటాయి. సజాతి ధృవాలు, విజాతి ధృవాలు ఎలా ఆకర్షించుకుంటాయో అదే విధంగా మేఘాల్లో ఉండే ఈ కణాలు ఆకర్షించుకుంటాయి.
ఒక మేఘం మరో మేఘంతో ఢీ కొట్టినప్పుడు వాటిలో ఉండే కణాలు ఒక దానితో మరొకటి కలుసుకోవడం వల్ల అక్కడ మిరుమిట్లు గొలిపే మెరుపుతోపాటు పెద్ద శబ్దం ఏర్పడుతుంది. దీనినే మెరుపు, ఉరుము అంటారు. మేఘం భూమికి తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మేఘంలో కింది భాగాన ఉండే రుణావేశ కణాలను భూమి మీద ఉండే ధనావేశ కణాలు ఆకర్షిస్తాయి. ఇలా ఇవి భూమికి చేరడానికి ఏదో ఒక వాహకం అవసరం. కావున ఆ ప్రదేశంలో ఎత్తైన వాటిని ఎంచుకుని వాటి ద్వారా భూమిని చేరుతాయి. అప్పుడు మెరుపుతో పాటు శబ్దం కూడా వస్తుంది. దీనినే పిడుగు అంటారు.
మేఘాల్లోని అణువులు ఒక దానితో మరొకటి ఢీ కొట్టుకోవడం వల్ల ఆకాశం నుండి భూమికి చేరే విద్యుత్ ఘాతాన్నే మనం పిడుగు అంటాం. పిడుగులో భారీ ఎత్తున విద్యుత్ ఉంటుంది. అది మనిషిని అక్కడిక్కకడే బూడిద చేయగలదు. పిడుగుపాటు కారణంగా ప్రతి సంవత్సరం దాదాపుగా1000 మంది మరణిస్తున్నారు. పిడుగులు మబ్బులు ఉండే ప్రాంతంలో అడ్డంగా, మబ్బులు లేని ప్రాంతంలో భూమి వైపు నిలువుగా ఇలా రెండు విధాలుగా ప్రయాణిస్తాయి. నిలువుగా ప్రయాణించే పిడుగులు 5 నుండి 6 మైళ్ల దూరం ప్రయాణిస్తే, అడ్డంగా ప్రయాణించే పిడుగులు 60 మైళ్ల నుండి 118 మైళ్ల దూరం వరకు ప్రయాణిస్తాయి.
పిడుగు పడడానికి 30 మిల్లీ సెకన్ల సమయం పడుతుంది. పిడుగు పడే ముందు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటి ద్వారా మనం పిడుగుపడుతుందని అంచనా రాకు రావచ్చు. వర్షం పడే ముందు శరీరంపై ఉండే వెంట్రుకలు నిక్కపొడుచుకుంటే దగ్గర్లో పిడుగు పడుతుందని అర్థం. పిడుగు పడే ముందు శరీరం జలదరింపునకు గురి అవుతుంది. అలాగే దగ్గర్లో ఉండే ఇనుప వస్తువులు కదులుతాయి. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఇంట్లో నుండి బయటకు రాకూడదు. బయట ఉంటే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి.
ఎత్తైన టవర్లు, చెట్ల కింద అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఎత్తైన వస్తువులు పిడుగులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. సెల్ ఫోన్, ల్యాండ్ లైన్, వైఫై వంటి వాటిని వాడకూడదు. మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు విద్యుత్ పరికరాల ప్లగ్స్ అన్నింటినీ తీసేయాలి. ఆకాశంలో మెరుపులు వస్తున్న సమయంలో ఎలాంటి సురక్షిత ప్రదేశం లేకపోతే మోకాళ్ల మీద తలను, చేతులను ఉంచి దగ్గరికి ముడుచుకుని కూర్చోవాలి. భూమి మీద కాళ్లను పూర్తిగా ఆనించకుండా వేళ్ల మీద నడవాలి.
ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో బండ్ల మీద ప్రయాణించకూడదు. కారులో ఉంటే కారును ఆఫ్ చేసి డోర్లు మూసుకుని కూర్చోవాలి. ఇళ్లల్లో ఉన్న వారు తలుపులు, కిటీకిలు మూసుకుని కూర్చోవాలి. అలాగే మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు షవర్ కింద స్నానం చేయడం కానీ పాత్రలు కడగడం కానీ చేయకూడదు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొలాల్లో ఇనుప వస్తువులను ఉపయోగించి పని చేయడం వంటివి చేయకూడదు.
ఇనుము త్వరగా పిడుగును ఆకర్షిస్తుంది. పిడుగు ఎక్కడ పడుతుందో అని తెలియజేసే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా అది ఎక్కడ పడుతుందో కచ్చితంగా తెలియజేయలేవు. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బయటకు వెళ్లి ప్రాణాల మీదు తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించి ప్రాణాలను నిలుపుకోవాలి.