Chapati : మారుతున్న జీవన విధానం కారణంగా స్థూలకాయంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. అధిక బరువు సమస్య నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అధిక బరువుతో బాధపడే వారు మొదట చేసే పని రాత్రిపూట అన్నం తినడం మానేసి ఆ స్థానంలో చపాతీలు తినడం. ఈ మధ్యకాలంలో వైద్యులు కూడా చపాతీ తినమని సూచిస్తున్నారు. దీంతో రాత్రి భోజనంలో చపాతీ వచ్చి చేరింది. రాత్రి పూట చపాతీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అసలు చపాతీలను తినడం వల్ల బరువు తగ్గుతారా.. చపాతీలను ఎలా తింటే మంచిది.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చపాతీలను గోధుమపిండితో తయారు చేస్తారు. గోధుమ పిండిలో విటమిన్ బి, విటమిన్ ఇ లతోపాటు కాల్షియం, ఐరన్, జింక్, సోడియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా మన శరీరానికి అవసరమయ్యే ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా గోధుమ పిండిలో ఉంటాయి. అన్నం తినడం వల్ల ఎంత శక్తి వస్తుందో అంతే శక్తి చపాతీలను తినడం వల్ల కూడా వస్తుంది. రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీలనే ఎందుకు తినాలి.. అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది.
అన్నం కంటే చపాతీ త్వరగా జీర్ణమవుతుంది. నూనె వేయకుండా లేదా తక్కువ నూనె వేసి చేసిన చపాతీల్లో అన్నం కంటే తక్కువ క్యాలరీలు ఉంటాయి. అలాగే అన్నం ఎంత తిన్నా కూడా కొందరికి కడుపు నిండిన భావన కలగదు. అలాంటప్పుడు రెండు లేదా మూడు చిన్నగా చేసిన చపాతీలు తినగానే మనకు కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. తద్వారా మనం బరువు సులువుగా తగ్గవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు రాత్రి భోజనంలో వారు తీసుకునే చపాతీలను కూడా నూనె లేకుండా తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే వాటిని సాయంత్రం 7 గంటల లోపు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కేవలం బరువు తగ్గడమే కాకుండా చపాతీలను తినడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
గోధుమల్లో అధికంగా ఉండే విటమిన్ ఇ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చపాతీలను తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. రాత్రిపూట చపాతీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాం. ఇలా చపాతీలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.