బాల్యదశలో కూడా డయాబెటీస్ పెద్దవారిలో వచ్చినట్లే వస్తుంది. అయితే, బాల్యదశలో అధికంగా వచ్చేదిది టైప్ 1 డయాబెటీస్. ఆశ్చర్య కరంగా, నేటి రోజుల్లో, బాల్యదశలో కూడా అధిక కేసుల్లో టైప్ 2 డయాబేటీస్ నమోదవుతుందంటున్నారు డయాబెటిక్ నిపుణులు. ఈ డయాబెటీస్ వ్యాధి నా బిడ్డకే రావాలా? అని తల్లిదండ్రులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ బిడ్డకు రావడం ఎంతో దురదృష్టకరం. బాల్యంలో వచ్చే డయాబెటీస్ కు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అయిప్పటికి వంశానుగతంగాను, పుట్టిన బిడ్డకు నిరోధకత తక్కువగాను లేదా పర్యావరణ ప్రభావంగాను రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని కేసుల్లో ఇన్సులిన్ కణాలను నాశనం చేసే వైరల్ వ్యాధులు కారణమని తెలిసింది. చాలా కేసుల్లో పిల్లలకు వచ్చే డయాబెటీస్ శాశ్వతమని, దానికి జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందేనని తేలింది. ఇన్ సులిన్ తప్పక తీసుకోవాలా? అంటే.. ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 1 శరీరంలో అవసరమైన ఇన్సులిన్ వుండదు కనుక డయాబెటీస్ కు ఇన్సులిన్ తప్పనిసరి.
ఇన్సులిన్ ఇవ్వకపోతే, బిడ్డ జీవితానికే హానికరమై కోమా దశలోకి జారిపోతాడు. బిడ్డకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఎప్పటినుండి ఇవ్వాలి? అంటే.. బాల్యదశ డయాబెటీస్ కు రోగ నిర్ధారణ అయినప్పటినుండి ఇన్సులిన్ ఇంజక్షన్ ఇస్తూనే వుండాలి. దీనివలన శరీరంలోని మెటబాలిక్ డిజార్డర్లు తగ్గి బిడ్డ కోమాలోకి వెళ్ళకుండా వుంటాడు. బాల్యదశ డయాబెటీస్ సుమారుగా బిడ్డకు 8 సంవత్సరాల వయసునుండే మొదలవ్వవచ్చు.