బొద్దింకలు… ఈ పేరు చెబితే చాలు కొందరికి ఒళ్లంతా జలదరిస్తుంది. ఇంకొందరైతే వాటిని చూస్తే దూరంగా పారిపోతారు. ప్రధానంగా మహిళలకు ఎక్కువగా ఇలా అనిపిస్తుంది. అయితే నేటి తరుణంలో ఎక్కడ ఏ ఇంట్లో చూసినా వీటి బాధ ఎక్కువగానే ఉంది. వీటిని తరిమికొట్టడం కోసం అందరూ నానా తంటాలు పడుతూనే ఉన్నారు. కానీ కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే అతి తక్కువ సమయంలోనే బొద్దింకలన్నింటినీ తరిమి కొట్టవచ్చు. ఆ టిప్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఒక కోడిగుడ్డును తీసుకుని పగలగొట్టి అందులోని సొనను సేకరించాలి. దాన్ని ఒక పాత్రలో వేసి అందులో 30 నుంచి 50 గ్రాముల బోరిక్ యాసిడ్ పౌడర్ (మార్కెట్‌లో దొరుకుతుంది)ను బాగా కలపాలి. దీంతో అది మెత్తని పేస్ట్‌లా మారుతుంది. ఆ పేస్ట్‌తో 1 సెంటీమీటర్ వ్యాసం కలిగిన చిన్న చిన్న బాల్స్‌ను తయారు చేసుకోవాలి. అనంతరం వాటిని నీడలో ఎండనివ్వాలి. కొంత సేపటికి అవి పొడిగా మారుతాయి. వాటిని తీసుకుని బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెట్టాలి. అంతే..!
పైన చెప్పిన టిప్‌తో బొద్దింకలు త్వరగా నాశనమవుతాయి. అయితే బొద్దింకలను తరిమికొట్టేందుకు మార్కెట్‌లో మనకు అనేక రకాల స్ప్రేలు అందుబాటులో ఉన్నా అవన్నీ విష పూరితమైనవి. కానీ పైన చెప్పింది సహజ సిద్ధంగా తయారు చేసింది. కాబట్టి దాంతో ఎలాంటి భయం లేదు. నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.