Millets : ఈ మధ్య కాలంలో ప్రజలకు వారు తీసుకునే ఆహారం పట్ల గానీ వారి ఆరోగ్యం పట్ల గానీ అవగాహన పెరిగిందనే చెప్పవచ్చు. దీంతో చాలా మంది ప్రజలు తెల్లని రైస్ బదులుగా చిరుధాన్యాలు లేదా తృణ ధాన్యాలు తీసుకోవడం చేస్తున్నారనడంలో సందేహం లేదు. వీటిలో ఉండే ఫైబర్, ఎమినో యాసిడ్స్, విటమిన్లు, ఖనిజాలు ఇంకా ఎన్నో అత్యవసర పోషక విలువలు ఉండడమే దీనికి కారణంగా తెలుస్తుంది. అలాగే గ్లూటెన్ పడనివారు గోధుమలకు ప్రత్యామ్నాయంగా కూడా వీటిని తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు.
అయితే ఈ చిరుధాన్యాలను తీసుకునే క్రమంలో సరైన పద్ధతులను పాటించక పోవడం వలన కొన్ని సందర్భాల్లో జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. సాధారణంగా చిరుధాన్యాలు రూక్ష, లఘు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ స్వభావం వలన ఇవి శరీరంలోని తేమను, నీటి శాతాన్ని తగ్గిస్తాయి. దాంతో వాతం సమస్య ఉత్పన్నమై మలబద్దకం, కడుపు ఉబ్బరం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. వాత గుణం కలిగిన దేహం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన చిరుధాన్యాలు తిన్నప్పుడు మలబద్దకం, ఉబ్బరం రాకుండా చేయవచ్చని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరు ధాన్యాలను తీసుకోవడానికి ముందు కనీసం 5 నుండి 6 గంటల పాటు నీటిలో నాన బెట్టుకోవాలి. వీటిని వండుకునేప్పుడు నెయ్యి, రాతి ఉప్పు, ఎండబెట్టిన అల్లం పొడి మొదలైనవి కలుపుకోవాలి. అలాగే చిరుధాన్యలతోపాటు ఉడికించిన కూరగాయలను కూడా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వలన చిరు ధాన్యాలు తీసుకున్నప్పుడు సరిగా జీర్ణం అయ్యి మలబద్దకం, ఉబ్బరం లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.