Iron And Calcium With Folate : మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలను కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పోషకాలను మనం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐరన్, క్యాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలను మనం రోజూ తీసుకోవాల్సిందే. లేదంటే వీటి లోపం ఏర్పడి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఈ పోషకాలు గనక మన శరీరంలో లోపిస్తే దాంతో మనకు తీవ్ర అలసట, నీరసం వస్తాయి. ఎముకలు బలహీనంగా మారిపోయి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే గర్భిణీలకు ఆ సమయంలో ఈ పోషకాల లోపం గనక వస్తే గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు.
కనుక ఈ పోషకాల విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మిగిలిన పోషకాల మాట అటుంచితే అతి ముఖ్యమైన ఈ పోషకాలను మాత్రం రోజూ అందేలా చూసుకోవాలి. ఇక పలు రకాల ఆహారాలను రోజూ తింటే ఈ పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటంటే.. ఐరన్ మనకు శరీరంలో ఆక్సిజన్‌ను కణాలకు చేరవేసేందుకు సహాయం చేస్తుంది. అందువల్ల ఐరన్ లోపిస్తే కణాలకు ఆక్సిజన్ అందదు. దీంతో మనకు అలసట, నీరసం, తరతిరగడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఐరన్ మనకు వెజ్, నాన్ వెజ్ రెండు రకాల ఆహారాల్లోనూ లభిస్తుంది.
మటన్, చికెన్, కోడిగుడ్లు, చేపలు, ప్రాన్స్ మొదలైనవి తింటే మనకు ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. మాంసాహార ప్రియులు అయితే ఐరన్ కోసం వీటిని తినవచ్చు. ఇక శాకాహారులు ఐరన్ కోసం పప్పు దినుసులు, నల్ల శనగలు (పొట్టుతో సహా), పాలకూర, తృణ ధాన్యాలు, మిల్లెట్స్, గుమ్మడికాయ విత్తనాలను తినాల్సి ఉంటుంది. అయితే విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, టమాటాలు, క్యాప్సికం వంటి వాటిని ఐరన్ ఫుడ్స్‌తో కలిపి తినాలి. దీంత మన శరరీం మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐరన్‌ను సులభంగా శోషించుకుంటుంది.
ఇక క్యాల్షియం మన శరీరంలో ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతోపాటు కండరాల పనితీరుకు, నాడీ వ్యవస్థకు కూడా క్యాల్షియం అవసరం అవుతుంది. అయితే క్యాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా మారుతాయి. దీంతో ఆస్టియోపోరోసిస్ అనే సమస్య వచ్చి చిన్న దెబ్బ తగిలినా ఎముకలు సులభంగా విరిచే చాన్స్‌లు పెరుగుతాయి. కనుక క్యాల్షియం లోపం ఉంటే వెంటనే అప్రమత్తం అయి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక క్యాల్షియం మనకు పాలు, పెరుగు, చీజ్, బాదంపప్పు, జున్ను, బాదం పాలు, సోయా పాలు, బ్రోకలీ, క్యాలిఫ్లవర్, క్యాబేజీ, కోడిగుడ్లు, పాలకూర వంటి వాటిల్లో సమృద్ధిగా లభిస్తుంది. కనుక క్యాల్షియం లోపం నుంచి బయట పడాలంటే ఈ ఆహారాలను తినాల్సి ఉంటుంది.
అయితే క్యాల్షియం ఆహారాలను తినే వారు శరీరానికి విటమిన్ డి అందేలా చూసుకోవాలి. దీంతో మన శరీరం మనం తిన్న ఆహారాల్లో ఉండే క్యాల్షియంను సులభంగా శోషించుకుంటుంది. ఇక ఫోలేట్ (విటమిన్ బి9) మనకు కణాల నిర్మాణానికి, ఎర్ర రక్త కణాల తయారీకి, గర్భంలో ఉన్న పిండం ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుకనే గర్భిణీలకు ఫోలేట్ ఉండే మెడిసిన్లను కూడా డాక్టర్లు ఇస్తుంటారు. ఇక ఫోలేట్ లోపిస్తే మనకు అలసట, రక్తహీనత, పుట్టబోయే పిల్లల్లో ఎదుగుదల లోపాలు వంటి సమస్యలు వస్తాయి.
అయితే ఫోలేట్ మనకు పలు ఆహారాల్లో లభిస్తుంది. అవేమిటంటే.. ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలు, పప్పు దినుసులు, బీన్స్, రాజ్మా, అవకాడో, సిట్రస్ ఫలాలు, తృణ ధాన్యాల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తింటే మంచిది. అయితే ఫోలేట్ ఉన్న ఆహారాలను గనక ఉడికించి తింటే మరీ బాగా ఉడికించకూడదు. బాగా ఉడికిస్తే వాటిల్లో ఉండే ఫోలేట్ శాతం తగ్గుతుంది. కనుక ఫోలేట్ ఉండే ఆహారాలను మరీ అతిగా ఉడికించకూడదు. దీని వల్ల ఫోలేట్ అలాగే ఉంటుంది. తద్వారా అది మన శరీరానికి అందుతుంది.
అయితే ప్రస్తుతం చాలా వరకు ఫుడ్ కంపెనీలు ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌ను విక్రయిస్తున్నాయి. వాటిల్లో దాదాపుగా అన్ని పోషకాలు ఉంటాయి. కనుక పోషకాహార లోపం ఉన్నవారు రోజూ అలాంటి ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌ను తినవచ్చు. ఇక అంతగా అవసరం అయితే డాక్టర్ వద్దకు వెళ్లి ఆయా పోషకాలకు చెందిన ట్యాబ్లెట్లను రాయించుకుని వాడవచ్చు. దీంతో వాటి లోపం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇలా ఈ పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. కనుక వీటి లోపం రాకుండా చూసుకోండి. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.