నిత్యం వాకింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవచ్చు. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మధుమేహం ఉన్నవారికైతే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాకింగ్ ఎవరైనా ఎలా చేస్తారు..? ఎలా చేయడమేమిటి..? ఎవరైనా కాళ్లతోనే కదా చేసేది..! అనబోతున్నారా..! అయితే మీరు చెబుతోంది కరెక్టే..! కానీ సాధారణ కాళ్లతో కాకుండా మోకాళ్లతో వాకింగ్ చేస్తే ఇంకా మంచిదట. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
చైనా సాంప్రదాయ వైద్యంలో మోకాళ్ల ద్వారా నడిపించి వ్యాధులను నయం చేసే పద్ధతి ఒకటుంది. అదెలాగంటే వ్యాధిగ్రస్తులను నిత్యం మోకాళ్లపై 15 నుంచి 20 నిమిషాలు లేదా వారు నడిచినంత సేపు రోజూ నడిపిస్తారు. దీంతో మోకాళ్ల వద్ద ఉండే పలు ప్రత్యేకమైన పాయింట్లు శరీరంలోని ఆయా అవయవాలకు కనెక్ట్ అవుతాయి. అలా కనెక్ట్ అవడం వల్ల ఆయా అవయవాలు ఉత్తేజితమవుతాయి. దీంతో అవి చురుగ్గా పనిచేయడంతోపాటు వ్యాధులను కూడా నయం చేస్తాయి.
మోకాళ్ల వద్ద ఉండే ప్రత్యేకమైన ఆక్యుప్రెషర్ పాయింట్లు శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు కనెక్ట్ అవుతాయని, ఈ క్రమంలోనే దాదాపుగా ఎలాంటి అనారోగ్యాన్నైనా ఈ పద్ధతి ద్వారా తగ్గించుకోవచ్చని చైనీస్ సాంప్రదాయ వైద్యం చెబుతోంది. దీన్నే నీ వాకింగ్ (Knee Walking) అని కూడా పిలుస్తారు. దీన్ని ఎవరైనా ప్రయత్నించవచ్చు. అయితే ఆరంభంలో మోకాళ్లపై నడవడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి వారు మోకాళ్ల కింద రెండు చిన్నపాటి మెత్తలను పెట్టుకుని వీలైనంత దూరం మోకాళ్లపై నడిస్తే చాలు. దాంతో వచ్చే మార్పులను మీరే గమనిస్తారు. అయితే మోకాళ్లు, కీళ్ల నొప్పులు ఉన్న వారు ఈ పద్ధతిని పాటించేముందు కొంత జాగ్రత్త వహించడం బెటర్.