Mutton And Heart Health : మనలో చాలా మంది రెడ్ మీట్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. బీఫ్, పోర్క్, మేక మాంసాన్ని రెడ్ మీట్ అని పిలుస్తారు. రెడ్ మీట్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొందరు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. అయితే రెడ్ మీట్ ను తీసుకోవడం తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్ ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని గుండె సంబంధిత సమస్యలతో పాటు మనం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రెడ్ మీట్ ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించి తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరుగుతుందని వారు చెబుతున్నారు.
రెడ్ మీట్ ను వేయించి, గ్రిల్ చేసి తీసుకోవడం వల్ల దానిలో గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ( ఎజిఇ) అనే సమ్మేళనాలు తయారవుతాయి. వీటి కణాల్లో ఇన్ ప్లామేషన్ తో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. దీంతో మనం అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే రెడ్ మీట్ లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో సి – రియాక్టివ్ ప్రోటీన్, ఇంటర్లుకిన్ – 6 వంటి ఇన్ ప్లామేటరీ మార్కర్ లను ఉత్పత్తి చేస్తాయి. దీంతో శరీరంలో ఇన్ ప్లామేషన్ పెరిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.
అలాగే రెడ్ మీట్ లో ఉండే పోషకాలు ప్రేగుల్లో విచ్చినం అయినప్పుడు ట్రైమిథైలామైన్ ఎన్ ఆక్సైడ్( టిఎమ్ఎఒ) ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ధమనులను గట్టి పరిచి గుండె పోటుకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి క్రమంగా గుండె జబ్బులకు కారణమయ్యే అవకాశం ఉంది. అయితే బీఫ్, పోర్క్ మాంసంతో పోల్చిననప్పుడు మేక మాంసంలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. కనరుక మేకమాంసం ఒక ప్రత్యామ్నాయంగానే చెప్పవచ్చు. ఈ విధంగా రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ మీట్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు ఉన్న వారు వీటిని తీసుకోవడం పూర్తిగా తగ్గించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని వీలైనంత వరకు తక్కువ నూనెలో ఉడికించి తీసుకునే ప్రయత్నం చేయాలని నూనె వేసి వేయించి గ్రిల్ చేసి తీసుకోవడం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులుగా వృక్ష సంబంధమైన ఆహారాలను తీసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.