Hotel Style Mysore Bonda : మనకు ఉదయం పూట హోటల్స్ లో లభించే అల్పాహారాల్లో మైసూర్ బోండాలు కూడా ఒకటి. మైసూర్ బోండాలు పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు.పల్లీ చట్నీ, సాంబార్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. హోటల్స్ లో లభించే ఈ మైసూర్ బోండాలను అదే రుచితో అంతే పర్పెక్ట్ గా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే హోటల్ స్టైల్ మైసూర్ బోండాలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ మైసూర్ బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
పుల్లటి పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, వంటసోడా – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, మైదాపిండి – ఒక కప్పు, వేడి నీళ్లు – తగినన్ని, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక టేబుల్ స్పూన్, అల్లం తరుగు – అర టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు -ఒక టేబుల్ స్పూన్.
హోటల్ స్టైల్ మైసూర్ బోండా తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పెరుగు వేసి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తరువాత ఉప్పు, వంటసోడా. నూరె వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తరువాత పిండి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత చేత్తో పిండిని పైకి కిందికి అటూ బీట్ చేసుకోవాలి. ఇలా 5 నుండి 10 నిమిషాల పాటు బీట్ చేసిన తరువాత ఇందులో మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతులకు తడి చేసుకుంటూ పిండిని తీసుకుని బోండాలుగా నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ కదుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మైసూర్ బోండాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే సులభంగా హోటల్ స్టైల్ మైసూర్ బోండాలను తయారు చేసి తీసుకోవచ్చు.