Palmyra Fruit Benefits : వేసవి కాలంలో మనకు ఎక్కడ చూసినా తాటి ముంజలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవి మనకు ఎక్కువగా లభిస్తాయి. పట్టణాలు, నగరాల్లో వీటిని రహదారుల పక్కన విక్రయిస్తుంటారు. వీటిని చూస్తుంటేనే చాలా మందికి నోట్లో నీళ్లూరుతుంటాయి. అయితే తాటి ముంజలు మనకు కేవలం వేసవి సీజన్‌లోనే లభిస్తాయి కనుక ఈ సీజన్‌లోనే మనం వీటిని తినాల్సి ఉంటుంది. వీటిని అసలు మిస్ చేసుకోకూడదు. తాటి ముంజలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తాటి ముంజల్లో చర్మానికి మేలు చేసే ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే చర్మం మృదువుగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. చర్మంలో తేమ ఉంటుంది. అందువల్ల చర్మం పొడిబారదు. అలాగే తాటి ముంజల గుజ్జును రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మారుతాయి. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు సైతం తగ్గుతాయి.
వేసవిలో చాలా మందికి సహజంగానే జీర్ణ సమస్యలు వస్తుంటాయి. విరేచనాలు అవుతుంటాయి. అలాంటి వారు తాటి ముంజలను తింటే ఫలితం ఉంటుంది. దీంతో తిన్న ఆహారం సైతం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ తగ్గుతుంది. పొట్టలో చల్లదనం చేకూరుతుంది. తాటి ముంజల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తింటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. అలాగే శరీరంలోని ద్రవాలను కోల్పోకుండా ఉంటాము. దీంతో మూత్రం కూడా సాఫీగా వస్తుంది. శరీరంలోని వేడి తగ్గుతుంది.
తాటి ముంజలను తినడం వల్ల వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. పొట్టలో ఉండే నులిపురుగులను నశింపజేయాలంటే తాటి ముంజలను తినాలి. చర్మం వాపులకు గురైనప్పటికీ వీటిని తింటే తగ్గిపోతుంది. ఇలా తాటి ముంజల వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక వీటిని అసలు విడిచిపెట్టకుండా తినండి. దీంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.