Chintha Chiguru Chicken Fry : చింత చిగురుతో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. చింత చిగురు మనకు ఈ సీజన్‌లో అధికంగా లభిస్తుంది. దీంతో పప్పు, పచ్చడి వంటి వంటలతోపాటు దీన్ని ఇతర పదార్థాలతోనూ కలిపి వండుతారు. చింత చిగురును దేంతో కలిపి వండినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. చింత చిగురు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే చింత చిగురుతో మీరు చికెన్ కర్రీని వండే ఉంటారు. కానీ చింత చిగురు, చికెన్ కలిపి మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో, ఇందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బోన్‌లెస్ చికెన్ – అరకిలో, చింత చిగురు – ఒకటింపావు కప్పు, కొబ్బరి తురుము – రెండు టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్, ఉల్లిపాయలు – 2, పచ్చి మిర్చి – 3, పసుపు – పావు టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ధనియాల పొడి – 1 టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, నూనె – అర కప్పు, దాల్చిన చెక్క – రెండు ముక్కలు, లవంగాలు – 3.
చింత చిగురును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోయాలి. అది కాగాక దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి తరుగు వేయాలి. అవి బాగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్దం, చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 5 నిమిషాలు అయ్యాక పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి తురుము, గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చికెన్ పూర్తిగా ఉడికాక చింత చిగురు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి కూర పొడి పొడిగా అవుతుంది. అప్పుడు దింపేయాలి. దీంతో చింత చిగురు చికెన్ వేపుడు రెడీ అయినట్లే. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా ఏదైనా కూరతో కలిపి అన్నంలో నంజుకుని తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ దీన్ని ఎంతో ఇష్టపడతారు.