Coconut Ice Cream : వేసవి కాలంలో సహజంగానే చాలా మంది తినే ఆహారాల్లో ఐస్ క్రీమ్ కూడా ఒకటి. ఐస్‌క్రీమ్‌లలోనూ మనకు అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే కాస్త శ్రమిస్తే మనం ఇంట్లోనే చక్కని ఐస్‌క్రీమ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది బయట లభించే లాంటి టేస్ట్ ఉంటుంది. ఈ క్రమంలోనే కొబ్బరితో ఎంతో చక్కని రుచి ఉండే ఐస్ క్రీమ్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబీ రేకులు – పావు కప్పు, రోజ్ ఎసెన్స్ – కొన్ని చుక్కలు, లేత కొబ్బరి ముక్కలు – అర కప్పు (పేస్టులా చేసుకోవాలి), చల్లని వెన్న తీయని పాలు – రెండున్నర కప్పులు, చక్కెర – ముప్పావు కప్పు, మొక్కజొన్న పిండి – రెండు టేబుల్ స్పూన్లు, తాజా క్రీమ్ – ముప్పావు కప్పు.
ఒక గిన్నెలో మొక్కజొన్న పిండి, పావు కప్పు పాలు కలిపి పెట్టుకోవాలి. మిగిలిన పాలు, చక్కెరను మరో గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాలి. పాలు వేడెక్కాక మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి కలిపి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక తాజా క్రీమ్, కొబ్బరి పేస్టు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆరు గంటలయ్యాక బయటకు తీసి రోజ్ ఎసెన్స్ వేసి ఓసారి మిక్సీ పట్టి గులాబీ రేకులు కలిపి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. 6-7 గంటలకు ఇది గట్టిపడుతుంది. దీంతో ఎంతో రుచిగా ఉండే కొబ్బరి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. దీన్ని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు.