Refrigerated Foods : మనలో చాలా మంది భోజనం చేస్తూ చల్లటి పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. భోజనం చేస్తూ చల్లటి నీటిని తాగుతారు. శీతల పానీయాలను తాగడానికి ఇష్టపడతారు. చల్లటి పెరుగును తీసుకుంటూ ఉంటారు. అలాగే కొందరు భోజనం చేసిన తరువాత ఐస్ క్రీమ్ లను, కుల్ఫీ, చల్లటి కీర్ వంటి వాటిని తీసుకుంటూ ఉంటారు. ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ను తీసుకున్నప్పుడు, రెస్టారెంట్ లకు వెళ్లినప్పుడు ఎక్కువగా ఇలా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా భోజనం చేస్తూ చల్లటి పదార్థాలను తీసుకోవడం మంచిదేనా.. ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా జీర్ణసమస్యలు తలెత్తుతాయా.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం తిన్న ఆహారం మన జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణం అవ్వాలంటే మన జీర్ణాశయంలో ఎల్లప్పుడూ 100 ఫారన్ హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. ఇలా ఉష్ణోగ్రత ఉన్నప్పుడే జీర్ణరసాలు, ఎంజైమ్ లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మనం వేడి వేడిగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల అవి మన జీర్ణాశయంలో ఉండే ఉష్ణోగ్రతకు సరిపోతాయి. దీంతో మనం తిన్న ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి. అయితే మనం చల్లటి పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఉండే ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి.ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చల్లటి నీరు, చల్లటి పెరుగు వంటి వాటిని తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ఉండే ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుతాయి. దీంతో జీర్ణక్రియ పూర్తిగా తగ్గుతుంది. మరలా ఉష్ణోగ్రతలు పెరిగిన తరువాత మాత్రమే జీర్ణక్రియ ప్రారంభమవుతుంది.
ఇలా మరలా జీర్ణక్రియ ప్రారంభమవ్వడానికి కనీసం 15 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. ఇలా జీర్ణక్రియ ఆగిపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారం పొట్ట, ప్రేగుల్లో నిల్వ ఉంటుంది. ఆహారం నిల్వ ఉండడం వల్ల అవి పులిసిపోయి గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉండడం వల్ల ప్రేగులు, జీర్ణాశయం అంచుల వెంబడి చికాకు వస్తుంది. పొట్టలో ఇబ్బందిగా ఉంటుంది. కనుక మనం భోజనం చేస్తూ చల్లటి పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వేడిగా ఉండే పదార్థాలను, చల్లగా, అతి చల్లగా ఉండే పదార్థాలను అస్సలు కలిపి తీసుకోకూడదని దీంతో జీర్ణాశయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాటు ఉన్న వారు ఇప్పటికైనా దీనిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.