Sweet Corn : పూర్వం రోజుల్లో అయితే మొక్కజొన్నలను కేవలం సీజన్‌లోనే విక్రయించేవారు. అందువల్ల ఏడాది పొడవునా అవి లభించేవి కావు. కానీ ఇప్పుడు మొక్కజొన్నలు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ కార్న్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్ ఉంటాయి. ఇవన్నీ మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీర విధులు సక్రమంగా నిర్వర్తించేలా చూస్తాయి. స్వీట్ కార్న్‌లో సాల్యుబుల్, ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ రెండూ ఉంటాయి. అందువల్ల జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. సుఖ విరేచనం అవుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
స్వీట్ కార్న్‌లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా లుటీన్, జియాజాంతిన్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల స్వీట్ కార్న్‌ను తింటే కళ్లు సురక్షితంగా ఉంటాయి. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా ఉంటాయి. అలాగే కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. స్వీట్ కార్న్‌లో సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అందువల్ల స్వీట్ కార్న్‌ను తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుందని చెప్పవచ్చు. దీంతో నీరసం, అలసట ఉండవు. ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు.
స్వీట్ కార్న్‌లో ఫైబర్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు. స్వీట్ కార్న్‌లో క్యాలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. పైగా ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక కాస్త తిన్నా చాలు.. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
స్వీట్ కార్న్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. స్వీట్ కార్న్‌లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిల్లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో చర్మం మృదువుగా మారి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు రావు. ముఖంపై ముడతలు రాకుండా యవ్వనంగా ఉంటారు. ఇలా స్వీట్ కార్న్‌ను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కనుక ఇకపై స్వీట్ కార్న్ కనిపిస్తే ఇంటికి తెచ్చుకోవడం మరిచిపోకండి.