మనం గుమ్మడికాయతో పాటు గుమ్మడి గింజలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మడికాయ వలె గుమ్మడి గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజూ ఆహారంలో భాగంగా వీటిని తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. అసలు గుమ్మడి గింజలల్లో దాగి ఉన్న పోషకాలు ఏమిటి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల పురుషుల్లో ఉండే ప్రోస్టేట్ గ్రంథి పని తీరు మెరుగుపడుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి ప్రోస్టేట్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. అలాగే గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు తిమ్మిర్లు పట్టడం తగ్గడంతో పాటు కండరాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది. మోనోపాజ్ దశలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి.
అలాగే గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, బీటా కెరోటీన్ వంటి పోషకాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. అలాగే జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గుమ్మడి గింజలు మనకు దోహదపడతాయి. గుమ్మగి గింజలను తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది.
అదే విధంగా ఈ గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా గుమ్మడి గింజలు మనకు దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.