Weight Gain : అధిక బరువు సమస్య అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే బరువు తగ్గాలని అనుకునేవారితోపాటు బరువు పెరగాలని అనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. లావుగా ఉన్నవారు బరువు తగ్గాలని చూస్తుంటే.. సన్నగా ఉన్నవారు బరువు పెరగాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే.. అందుకు అంజీర్ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. వాటిని కొన్ని ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. అంజీర్ పండ్లను కిస్మిస్‌లతో కలిపి తింటే బరువు వద్దన్నా పెరుగుతారు. రెండింటిలోనూ అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. రోజూ రాత్రి పూట 10 కిస్మిస్‌లు, 5 అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని బ్రేక్ ఫాస్ట్ తో కలిపి తీసుకోవాలి. దీంతో బరువు పెరుగుతారు. అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
2. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలతో 3, 4 అంజీర్ పండ్లను తీసుకోవాలి. అంజీర్ పండ్లను తిన్నాక పాలు తాగాలి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడమే కాక బరువు పెరిగేందుకు సహాయ పడతాయి. అయితే పాలను కొవ్వు తీయనివి తాగితే మంచిది. దీంతో త్వరగా బరువు పెరుగుతారు.
3. ఉదయాన్నే పాలలో కొన్ని ఓట్స్ వేసి, అందులోనే 3, 4 అంజీర్ వేసి ఉడకబెట్టి తినాలి. ఒక కప్పు మోతాదులో ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.
4. రాత్రి పూట 10 అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో వీటిని తినాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా బరువు పెరుగుతారు.
5. రాత్రి పూట 4, 5 ఖర్జూరాలు, అంతే మోతాదులో అంజీర్ పండ్లను తీసుకుని కలిపి తినాలి. ఇలా రోజూ తినడం వల్ల బరువు పెరుగుతారు. అయితే వేడి శరీరం ఉన్నవారు ఖర్జూరాలను తినరాదు.