Eyes Health : పూర్వం రోజుల్లో మన పెద్దలు ఎంతో బలవర్ధకమైన ఆహారం తినేవారు. కనుక వారికి వృద్ధాప్యం వచ్చినా కూడా కంటి చూపు స్పష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడిపోయారు. అలాగే శారీరక శ్రమ చేయడం లేదు. దీంతో అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు కేవలం పెద్దలకు మాత్రమే కాదు, పిల్లలకు కూడా సమస్యగా మారింది. చాలా చిన్నతనం నుంచే చాలా మంది కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రోజువారీ ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
మనం రోజూ తీసుకునే ఆహారాల్లో పలు మార్పులు చేసుకుంటే మన కళ్లను మనమే సంరక్షించుకున్న వాళ్లం అవుతాం. పలు రకాల ఆహారాలను రోజూ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతోపాటు కంటి చూపు కూడా పెరుగుతుంది. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు క్యాప్సికంను చాలా మంది చూసే ఉంటారు. అయితే కంటి చూపును పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్యాప్సికంలో విటమిన్ సి ఉంటుంది. అలాగే లుటీన్, జియాజాంతిన్ అనబడే కెరోటినాయిడ్స్ ఉంటాయి. విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా చేస్తుంది. అలాగే లుటీన్, జియాజాంతిన్‌లు కళ్లను హానికర అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి రక్షిస్తాయి.
దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి వల్ల కంటి కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. దీంతో కంటి చూపు సమస్య రాదు. అలాగే స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల వాపులను తగ్గిస్తాయి. దీంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తాయి. ఎరుపు రంగు ద్రాక్షల్లో రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి కణాలు డ్యామేజ్ అవకుండా చూస్తుంది. అందువల్ల తరచూ ఎరుపు రంగు ద్రాక్షలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
యాపిల్ పండ్లలో విటమిన్లు ఎ, సిలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయం చేస్తాయి. విటమిన్ ఎ వల్ల కంటి రెటీనా సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కంటి వాపులను తగ్గిస్తాయి. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది. ఇలా పలు రకాల ఆహారాలను, పండ్లను తినడం వల్ల కంటి చూపును పెంచుకోవచ్చు. దీంతోపాటు వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.