మన శరీరంలో రక్తం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మన శరీర భాగాలకు ఆక్సిజన్‌ను, పోషకాలను రవాణా చేస్తుంది. కనుక రక్తం తగినంతగా ఉండాలి. లేదంటే రక్తహీనత సమస్య వస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే రక్తం బాగా పెరగాలంటే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
* బీట్‌రూట్‌లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు బాగా తయారవుతాయి. రక్తం బాగా వృద్ధి చెందుతుంది. రోజూ ఒక కప్పు మోతాదులో బీట్‌రూట్ ముక్కలు లేదా జ్యూస్‌ను ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకుంటుండాలి. దీంతో రక్తం బాగా తయారవుతుంది.
* బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల కూడా రక్తం బాగా పెరుగుతుంది. దీని వల్ల అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.
* గుమ్మడికాయ విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తింటుంటే రక్తం బాగా తయారవుతుంది. ఈ విత్తనాల్లో ఫాస్ఫరస్, మెగ్నిషియం, మాంగనీస్, కాపర్ ఉంటాయి. ఇవి రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తాయి.
* బాదంపప్పును రోజూ గుప్పెడు మోతాదులో తినడం వల్ల కూడా శరీరంలో రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
* పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తం బాగా తయారవుతుంది.
ఇవే కాకుండా యాపిల్స్, టమాటాలు, క్యారెట్లు, తోటకూర, మొలకెత్తిన పెసలు, కిస్మిస్, ఖర్జూరాలు నారింజ, దానిమ్మ వంటి పదార్థాలను రోజూ తినడం వల్ల కూడా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.