ప్రయాణాలు చేసే సమయంలో సహజంగానే కొందరికి వాంతులు అవుతుంటాయి. కొందరికి బస్సు ప్రయాణం పడదు. కొందరికి కార్లలో ప్రయాణిస్తే వాంతులు అవుతాయి. కొందరికి రైలు లేదా విమాన ప్రయాణం పడదు. ఇలా రక రకాలుగా ఉంటారు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ప్రయాణాల్లో కలిగే వికారం, అయ్యే వాంతులను నివారించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
* ప్రయాణం చేసే ముందు లేదా ప్రయాణం మధ్యలో అల్లం ముక్కలు వేసి మరిగించిన డికాషన్ లేదా అల్లం టీ తాగాలి. అల్లంతో తయారు చేసే అల్లంమురబ్బాను కూడా తినవచ్చు. చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకున్నా ప్రయాణంలో వాంతులు, వికారం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
* సాధారణంగా కొందరు ప్రయాణం చేసే ముందు ఏమీ తినరు. దీని వల్ల కూడా వాంతులు, వికారం వస్తాయి. కనుక ప్రయాణం చేసే ముందు ఏదైనా తింటే మంచిది. ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
* పెప్పర్‌మింట్, లావెండర్, యాలకులు, సోంపు గింజలకు చెందిన ఎసెన్షియల్ ఆయిల్స్ మనకు సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. వాటిని ప్రయాణ సమయాల్లో దగ్గర ఉంచుకుని వాసన చూస్తుండాలి. దీంతో వాంతులు అవకుండా ఉంటాయి.
* ప్రయాణ సమయాల్లో ఐస్ క్యూబ్స్ దొరికితే వాటిని నాలుకకు ఆనించి రుచి చూసినట్లు చప్పరిస్తుండాలి. వికారం, వాంతులు తగ్గుతాయి.
* గ్రీన్ టీ లేదా హెర్బల్ టీని తాగినా ప్రయాణ సమయంలో వాంతులు కాకుండా చూసుకోవచ్చు.
* ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఒక నిమ్మకాయను దగ్గర పెట్టుకుని దానిపై ఉన్న పొట్టును కొద్దిగా తీసి వాసన చూస్తుండాలి. దీని వల్ల కూడా వాంతులు కాకుండా ఆపవచ్చు.
* కొందరికి డీ హైడ్రేషన్ కారణంగా వికారం, వాంతులు వస్తాయి. ఈ సమస్యను అధిగమించేందుకు నీళ్లను తాగాలి. ప్రయాణ సమయంలో వాటర్ బాటిల్‌ను పక్కన ఉంచుకుని కొద్ది కొద్దిగా నీళ్లను తాగుతుండాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.