Junk Food : ప్రస్తుత కాలంలో మారిన మన జీవన విధానం, ఆహారపుఅలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరూ జంక్ ఫుడ్ ను తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే హాని అంతా ఇంతా కాదు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు, గుండె సమస్యలు, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, షుగర్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలతో పాటు చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. కొన్ని సార్లు ఈ జంక్ ఫుడ్ క్యాన్సర్ కూడా కారణం కావచ్చు. కనుక వీలైనంత వరకు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు వాటికి బదులుగా ఇతర ఆహారాలను తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా జంక్ ఫుడ్ కు బదులుగా ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
అలాగే ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. జంక్ ఫుడ్ కు బదులుగా తీసుకోదగిన ఇతర ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు పండ్లను తీసుకోవాలి. పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జంక్ ఫుడ్ కు బదులుగా డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. డార్క్ చాక్లెట్ లో దాదాపు 70 శాతం వరక కొకో ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు చర్మం సౌందర్యం కూడా పెరుగుతుంది. ఇక జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు పనీర్ ను తీసుకోవడం మంచిది. పనీర్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడంతో పాటు క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
అలాగే మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇక జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ప్రోజెన్ బనానా ఐస్ క్రీమ్ ను తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే జంక్ ఫుడ్ కు బదులుగా మనం పాప్ కార్న్ ను తీసుకోవడం మంచిది. అయితే ఈ పాప్ కార్న్ ను ఉప్పు, నూనెతో పాటు ఏ ఫ్లేవర్స్ లేకుండా తయారు చేసి తీసుకోవాలి.అదే విధంగా జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఆలివ్ ను తీసుకోవడం మంచిది.వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు వీటిలో ఉండే ఒలిక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, హేజెల్ నట్స్, వాల్ నట్స్ వంటివి తీసుకోవాలి.
వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ను ఉప్పు, నూనె, మసాలాలు లేకుండా నేరుగా తీసుకోవాలి. ఇక జంక్ ఫుడ్ కు బదులుగా కూరగాయలతో చేసిన చిప్స్ ను తీసుకోవడం మంచిది. నూనెలో వేయించిన చిప్స్ కాకుండా బేక్ చేసిన కూరగాయల చిప్స్, బనానా చిప్స్ వంటివి మనకు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్ కు బదులుగా సలాడ్స్ తీసుకోవడం మంచిది. వీటిలో చియా విత్తనాలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వంటి వాటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బయట లభించే జంక్ ఫుడ్ ను తిని అనారోగ్యాలను కొని తెచ్చుకోవడానికి బదులుగా ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.