ప్లాస్టిక్ అనేది ప్రతి చోటా ఉంటుంది. నిత్యం మనం వాడే అనేక రకాల వస్తువులు ప్లాస్టిక్‌తో తయారు చేసినవే. కిచెన్‌లో అనేక వస్తువులను మనం ప్లాస్టిక్‌తో తయారు చేసినవే ఎక్కువగా వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్ నిజానికి మనకు మంచిది కాదు. మన శరీరానికి ప్లాస్టిక్ హాని కలగజేస్తుంది. ప్లాస్టిక్‌లో అనేక చిన్న చిన్న సూక్ష్మ కణాలు ఉంటాయి. అవి విష పదార్థాలు. మన ఆరోగ్యానికి అవి హాని కలగజేస్తాయి. అందువల్ల ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వాడేవారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అవేమిటంటే..
1. కిచెన్ వస్తువులైన ప్లాస్టిక్ బాటిల్స్, టిఫిన్ బాక్సులు, కంటెయినర్లు అనేక రకాల రసాయన సమ్మేళనాలను కలిగి ఉంటాయి. వాటిని పాలీ కార్బనేట్ ప్లాస్టిక్స్ అంటారు. వాటిల్లో బయో యాక్టివ్ కెమికల్స్ అయిన బిస్‌ఫినాల్ ఎ (బీపీఏ), ఫ్తాలేట్స్ ఉంటాయి. బీపీఏ గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. బీపీఏ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల్లో మనం ఆహారాలను ఉంచితే బీపీఏ ఆహారంలోకి చేరుతుంది. ఈ క్రమంలో మనం ఆ ఆహారాన్నితింటే అప్పుడు బీపీఏ మన శరీరంలోకి చేరుతుంది. అది నేరుగా రక్తంలో కలుస్తుంది. దీంతో సంతాన సమస్యలు, మెటబాలిజం తగ్గుదల, ఎండోక్రైన్ వ్యవస్థపై ప్రభావం, మెదడు పనితీరు తగ్గుదల, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. అలాగే హార్మోన్ల సమస్యలు వస్తాయి. కనుక ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు.
2. ప్లాస్టిక్‌కు బదులుగా గ్లాస్‌తో తయారు చేసిన వస్తువులను ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు వాడాలి. ఆహారాలను నిల్వ చేసేందుకు, వంటకు, మళ్లీ వేడి చేయడానికి, ఫ్రిజ్‌లో పెట్టేందుకు, మైక్రోవేవ్ ఓవెన్‌లలో పెట్టేందుకు గ్లాస్ పాత్రలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. గ్లాస్ పాత్రలను 100 శాతం బోరోసిలికేట్ గ్లాస్‌తో తయారు చేస్తారు. అందువల్ల ఆహార పదార్థాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఆ పాత్రల్లో ఆహారాలను ఎలాంటి భయం లేకుండా నిరభ్యంతరంగా నిల్వ ఉంచుకోవచ్చు.
3. గ్లాస్ మట్టిలో కలిసేందుకు కొంత కాలమే పడుతుంది. అందువల్ల గ్లాస్ పర్యావరణానికి హాని చేయదు. కానీ ప్లాస్టిక్ మట్టిలో కలిసేందుకు అనేక వందల ఏళ్లు పడుతుంది. కనుక ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్లాస్టిక్ మట్టిలో కలిసినా ఆ మట్టి విష తుల్యం అవుతుంది. దీంతో అది గాలి కాలుష్యంపై ప్రభావం చూపిస్తుంది. పంటలు సరిగ్గా పండవు. మట్టిలోని సారం తగ్గుతుంది.
4. ప్లాస్టిక్ కన్నా గ్లాస్ పాత్రలను శుభ్రం చేయడం చాలా తేలిక. తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.
5. గ్లాస్ జార్‌లు, కంటెయినర్లు, ఇతర పాత్రలు చూసేందుకు ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. కనుక ప్లాస్టిక్‌కు బదులుగా గ్లాస్ పాత్రలను వాడడం మొదలు పెట్టండి. ఆరోగ్యంగా ఉండండి.