Thyroid : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ సమస్య ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. థైరాయిడ్ లో హైపో, హైపర్ అనే రెండు రకాలు ఉంటాయి. ఈ థైరాయిడ్ కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ సమస్య బారినపడితే జీవితాంతం మందులను వాడాల్సి ఉంటుంది. థైరాయిడ్ సమస్య బారిన పడగానే చాలా మంది ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. మందులను వాడుతూ ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే థైరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. థైరాయిడ్ తో బాధపడే వారు పాటించాల్సిన ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ గ్రంథి టి3, టి4 హార్మోన్లను తగిన స్థాయిలో విడుదల చేయదు. ఈ స్థితిని హైపో థైరాయిడిజం అంటారు. దీని కారణంగా బరువు పెరగడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, కండరాల నొప్పులు, వాపులు, మలబద్దకం వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హైపో థైరాయిడ్ తో బాధపడే వారు అయోడిన్ ఉన్న ఉప్పును తీసుకోవాలి. అలాగే చేపలను, ఆలివ్ నూనెను, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. అదే విధంగా రోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవాలి. హైపో థైరాయిడ్ తో బాధపడే వారు వారి థైరాయిడ్ స్థాయిలను బట్టి రోజుకు ఒకటి లేదా రెండు కోడిగుడ్లను తీసుకోవాలి.
అయితే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు గుడ్డులోని పచ్చ సొనను తీసేసి తినాలి. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కొవ్వు తక్కువగా ఉండే పాలు, పెరుగు, చీజ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వీరు గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోకూడదు. అదే విధంగా సోయా గింజలను, సోయా ఉత్పత్తులతో పాటు సగం ఉడికించిన ఆకుకూరలను అస్సలు తీసుకోకూడదు. బ్రకోలి, బచ్చలి కూర, క్యాబేజ్, క్యాలీప్లవర్ వంటి వాటిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను, జంక్ ఫుడ్ ను, వేయించిన బంగాళాదుంపలను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అదే విధంగా థైరాయిడ్ లో ఉండే మరో రకం హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.
దీనిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ సమస్యతో బాధపడే వారు పండ్లను, తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. బ్రకోలి, క్యాబేజ్, క్యాలీప్లవర్, క్యారెట్, ముల్లంగి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే హెర్బల్ టీ లను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి హైపర్ థైరాయిడ్ సమస్యను తగ్గిస్తాయి. అలాగే మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ను, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ స్థాయిలు క్రమబద్దీకరించబడతాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఈ ఆహారాలను తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులను వాడుతూ ఉంటే థైరాయిడ్ సమస్యను సులువుగా అధిగమించవచ్చు.