హెల్త్ టిప్స్

ర‌క్త‌హీన‌త నుంచి బ‌యట ప‌డేందుకు కాంబోడియా వాసుల వినూత్న ప్ర‌యోగం ల‌క్కీ ఐర‌న్ ఫిష్‌..!

అనీమియా… ర‌క్త‌హీన‌త‌… పేరేదైనా, ఏ భాష‌లో చెప్పినా ఈ వ్యాధి వ‌ల్ల ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది మృత్యువాత ప‌డుతున్నారు. అనేక అనారోగ్య లక్ష‌ణాల‌కు మూల‌కార‌ణ‌మైన ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఇప్పుడు చాలా దేశాలను ప‌ట్టి పీడిస్తోంది. ప్ర‌ధానంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వారే ఎక్కువ‌గా దీని బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శ‌రీరం స‌రిగ్గా ఎద‌గ‌క‌పోవ‌డం, మానసిక అస‌మ‌తుల్య‌త‌, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం, తీవ్ర అల‌స‌ట వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు లోనై చివ‌ర‌కు మృతి చెందుతున్నారు. ఎన్నో దేశాలు ర‌క్త‌హీన‌త ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహన క‌ల్పిస్తున్నా అవి స‌రైన ఫ‌లితం ఇవ్వ‌డం లేదు. అయితే కాంబోడియా మాత్రం అలాంటి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంతో కాదు, ఓ వినూత్న ప్రయోగంతో అక్క‌డి ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను దాదాపుగా స‌గానికి స‌గం త‌గ్గించ‌గ‌లిగింది. అది ఎలాగో తెలుసా..? ల‌క్కీ ఐర‌న్ ఫిష్‌తో..!

అవును మీరు విన్న‌ది క‌రెక్టే..! ల‌క్కీ ఐర‌న్ ఫిష్‌తోనే అక్క‌డి ప్ర‌జ‌లు చాలా మంది ర‌క్త‌హీన‌త బారి నుంచి బ‌య‌ట ప‌డ్డారు. ల‌క్కీ ఐర‌న్ ఫిష్ అంటే అదేదో చేప ర‌కం, దాన్ని తినాల‌ని అనుకునేరు. అది మాత్రం కాదు. ఎందుకంటే ల‌క్కీ ఐర‌న్ ఫిష్ అనేది నిజానికి బ‌తికి ఉన్న చేప కాదు. నిర్జీవ‌మైన చేప‌. స్వ‌చ్ఛ‌మైన ఇనుముతో త‌యారు చేసింది. 200 గ్రాముల బ‌రువు ఉంటుంది. దీన్ని అక్క‌డి ప్ర‌జ‌లు తాము వంట చేసే పాత్ర‌లో వేసి దానిపై కొన్ని నిమ్మ చుక్క‌లు చ‌ల్లి, అనంత‌రం నీరు పోసి కొంత సేపు ఉడికిస్తారు. దీంతో స‌ద‌రు ఐర‌న్ ఫిష్‌లో ఉండే ఇనుము ఆ నీటిలోకి దిగుతుంది. అనంత‌రం ఆ నీటితో వంట చేసుకుంటారు. అప్పుడు అలా వండిన ఆహారాన్ని తింటే దాంతో వారికి ఆ రోజుకు కావ‌ల్సిన ఐర‌న్‌లో 75 శాతం వ‌ర‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో అక్క‌డి ప్ర‌జ‌లు రోజూ అలా ల‌క్కీ ఐర‌న్ ఫిష్‌తో వంట వండుకుంటూ ర‌క్త హీన‌త బారి నుంచి బ‌య‌ట ప‌డ్డారు.

what is lucky iron fish supplied in combodia

కాంబోడియా ప్ర‌జ‌లు నిత్యం అలా ల‌క్కీ ఐర‌న్ ఫిష్‌తో వంట వండుకుని తింటుండ‌డం వ‌ల్ల దాంతో కొద్ది కాలంలో అక్క‌డి ప్ర‌జ‌ల్లో 50 శాతం మందికి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య దూర‌మైంద‌ట‌. ఈ క్ర‌మంలో అక్క‌డి ప్ర‌భుత్వం అలాంటి ఐర‌న్ ఫిష్‌ల‌ను ప్ర‌జ‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ట‌. దీంతో వారు కూడా వాటిని తీసుకుని వంట వండి తింటున్నార‌ట‌. నిత్యం తిండి అయినా మ‌ర్చిపోతున్నారేమోగానీ, ఐర‌న్ ఫిష్‌తో వంట వండడం మాత్రం అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రిచిపోవ‌డం లేద‌ట‌. అంత‌గా వారికి ఆ వినూత్న ప్రయోగం న‌చ్చింది మ‌రి. ఐర‌న్ టాబ్లెట్ల క‌న్నా చాలా త‌క్కువ ధ‌ర‌కే స‌ద‌రు ఫిష్ ల‌భిస్తుండ‌డంతో ఇప్పుడు అక్క‌డి ప్ర‌జలు సొంతంగా ఐర‌న్ ఫిష్‌ల‌ను కొనుక్కుంటున్నార‌ట‌. ఏదేమైనా కాంబోడియా ప్ర‌భుత్వం ఐడియా బాగుంది క‌దా..! అయితే నిజానికి ఈ ఐడియా అక్క‌డి ఓ స్వ‌చ్ఛంద సంస్థ ఇచ్చింద‌ట‌. డాక్ట‌ర్ క్రిస్టోఫ‌ర్ చార్లెస్ అనే వైద్యుడు సూచించ‌డంతో మొద‌ట అక్క‌డి ఓ ఎన్‌జీవో ఈ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టింది. అంతే… కొద్ది కాలంలోనే అది అంత‌టా పాకి, చివ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే దాని అమ‌లుకు పూనుకునేలా చేసింది. మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలా చేస్తే దాంతో పేద ప్ర‌జ‌ల‌కు చాలా తక్కువ ధ‌ర‌కే పోష‌కాహారం అందించిన వార‌మ‌వుతాం క‌దా..!

Admin

Recent Posts