Constipation : ఈమధ్య కాలంలో చాలా మందికి వస్తున్న అనారోగ్య సమస్యల్లో మలబద్దకం కూడా ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అస్తవ్యస్తమైన జీవన విధానం, తప్పుడు ఆహారపు అలవాట్లు, అతిగా భోజనం చేయడం, ఆలస్యంగా తినడం, మాంసం ఎక్కువగా తీసుకోవడం, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం.. ఇలా అనేక కారణాల వల్ల మలబద్దకం వస్తుంది. అయితే ఇది వస్తే చాలా మంది రోజూ టాయిలెట్‌లో గంటల తరబడి సుఖ విరేచనం కోసం కుస్తీ పడుతుంటారు. కానీ అలాంటి పనిలేకుండా కొన్ని నాచురల్ టిప్స్‌ను పాటిస్తే చాలు.. దాంతో మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఇక ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్దకం నుంచి బయట పడేందుకు మనం కొన్ని రకాల ఆహారాలను తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. పండ్లు, కూరగాయలు, నట్స్, విత్తనాలు వంటి వాటిల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీంతో జీర్ణక్రియ సైతం మెరుగుపడుతుంది. ముఖ్యంగా యాపిల్స్, జామ పండ్లు, కివి, పియర్స్, అరటి పండ్లు వంటి వాటిల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మలాన్ని మెత్తగా చేస్తుంది. దీంతో సుఖ విరేచనం అవుతుంది.
పండ్ల మాదిరిగానే ఆకుపచ్చని కూరగాయలు లేదా ఆకుకూరలను కూడా తినవచ్చు. ఇవి కూడా విరేచన ప్రక్రియను సులభతరం చేస్తాయి. దీంతో సుఖ విరేచనం అవుతుంది. ముఖ్యంగా పాలకూర, చిలగడదుంపలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇక ఈ సమస్య నుంచి బయట పడేందుకు మనకు త్రిఫల చూర్ణం కూడా చక్కగా పనిచేస్తుంది. మనకు మార్కెట్‌లో త్రిఫల చూర్ణం లేదాట్యాబ్లెట్లు లభిస్తాయి. వీటిని డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం వల్ల కూడా మలబద్దకం తగ్గుతుంది.
పప్పు దినుసుల్లోనూ మనకు ఫైబర్ అధికంగానే లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అలాగే పెరుగు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ప్రో బయోటిక్ ఆహారంగా పిలుస్తారు. దీన్ని తింటే మన జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలను తినడం వల్ల మలబద్దకం నుంచి సులభంగా బయట పడవచ్చు.