Ulli Pesarattu : మనం అనేక రకాల పప్పులను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో పెసలు కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో వీటిని వినియోగం ఎక్కువగా ఉంది. పెసలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఈ పెసర్లలో ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, బరువు తగ్గేలా చేయడంలో పెసలు ఎంతగానో ఉపయోగపడతాయి. పెసలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి పెసరట్లు. వీటిని మనం తరుచూ తయారు చేస్తూనే ఉంటాం. ఈ పెసరట్ల మీద ఉల్లిపాయలను చల్లి మనం ఉల్లి పెసరట్లను కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ పెసరట్టు హోటల్ లో దొరికే విధంగా రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లి పెసరట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – ఒక కప్పు, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిరపకాయలు – 4 లేదా తగినన్ని, అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), జీలకర్ర – కొద్దిగా, నూనె – అర కప్పు.
ఉల్లి పెసరట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసలను, బియ్యాన్ని, మినప పప్పును తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోయాలి. వీటిని 6 నుండి 8 గంటల పాటు లేదా ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకకున్న తరువాత వాటిని మరోసారి శుభ్రంగా కడిగి జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చి మిరపకాయలను, అల్లం ముక్కలను, ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడయ్యాక కావల్సిన పరిమాణంలో పిండిని తీసుకుని వీలైనంత పలుచగా దోశ వేసుకోవాలి. తరువాత దోశ మీద ఉల్లిపాయలను, జీలకర్రను చల్లి నూనె కూడా వేసుకోవాలి. ఈ దోశను రెండో వైపుకు తిప్పకుండా మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లి పెసరట్టు తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, టమాట చట్నీ, అల్లం చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పెసలతో హోటల్స్ లో దొరికే విధంగా ఉండే ఉల్లి పెసరట్టును చేసుకుని తినవచ్చు.