Snoring : ప్రస్తుతం మనల్ని వేధిస్తున్న అనేక సమస్యలలో గురక ఒకటి. గురక వల్ల మనతోపాటు ఇతరులు కూడా ఎంతో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. నాలుక, గొంతు కండరాలు వదులు అవ్వడం వల్ల గురక వస్తుంది. శ్వాసక్రియ వల్ల వదులు అయిన కణజాలం కదిలి గురక వస్తుంది. శ్వాస మార్గం ఎంత తక్కువగా ఉంటే గురక అంత ఎక్కువగా వస్తుంది. గురకను సాధారణ సమస్యగానే భావిస్తూ ఉంటాం. కానీ దీని వల్ల నిద్రలేమి, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు.
మనకు మార్కెట్ లో గురకను తగ్గించే పరికరాలు ఉన్నప్పటికీ ఇవి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేవు. సహజ సిద్దంగా ఇంటి చిట్కాల ద్వారా మనం గురకను తగ్గించుకోవచ్చు. మనం నిద్రించే గదిలో తేమ లేకపోవడం వల్ల కూడా గురక వస్తుంది. దీని వల్ల ముక్కు దిబ్బడగా ఉండి గురక వచ్చే అవకాశం ఉంటుంది. కనుక గదిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు కూడా గురక రావడానికి కారణంగా చెప్పవచ్చు. అధిక బరువు వల్ల శ్వాస మార్గంలో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. అవరోధాలు ఎంత ఎక్కువగా ఉంటే గురక అంత ఎక్కువగా వస్తుంది. బరువు తగ్గడం వల్ల గురక తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
పడుకునేటప్పుడు తల భాగం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. తల వైపు మంచం కింద 3 నుండి 4 ఇంచుల ఎత్తు ఉండే రాళ్లను, చెక్కలను పెట్టుకోవడవం వల్ల తల భాగం ఎప్పుడూ ఎత్తులో ఉంటుంది. ఇలా చేయడం వల్ల గురక తక్కువగా వస్తుంది. మనం పడుకునే గది శుభ్రంగా లేకపోవడం వల్ల కూడా గురక వస్తుంది. గదిలో ఉండే దుమ్ము, ధూళి, జంతువుల వెంట్రుకలు శ్వాస మార్గంలో అడ్డు పడి గురక వచ్చేలా చేస్తాయి.
అంతే కాకుండా కొందరు నోరు మూసి గురక పెడుతూ ఉంటారు. ఇలా గురక పెడితే కణజాలంలో సమస్య ఉందిగా భావించి వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కొందరు నోరు తెరిచి గురక పెడుతూ ఉంటారు. ఇలా గురక పెడితే గొంతులో సమస్య ఉన్నట్లు భావించాలి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస మీద నియంత్రణ ఉంటుంది. ఇవి చేయడం వల్ల గురక తగ్గడంతోపాటు వివిధ రకాల నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇక గొంతు, నాలుకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు గట్టి పడి గురక రావడం తగ్గుతుంది. ధూమపానం, మధ్యపానం చేయడం వల్ల కూడా గురక వస్తుంది. ఇవి గొంతు కణజాలాన్ని వదులు చేసి గురక వచ్చేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కనుక మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. దీంతో గురక తగ్గుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల గురక సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే శ్వాస కూడా సరిగ్గా ఆడుతుంది.