Sabja Seeds : సబ్జా గింజలు.. ఇవి మనలో చాలా మందికి తెలిసే ఉంటాయి. ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి వీటిని విరివిగా వాడుతున్నారని చెప్పవచ్చు. ఇవి మనకు మార్కెట్ లో చాలా సులభంగా లభిస్తాయి. కొందరు ఈ చెట్లను ఇండ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. వీటిని ఎక్కువగా నానబెట్టి నేరుగా తింటూ ఉంటారు. అలాగే షర్బత్, జ్యూస్ వంటి వాటిలో కలిపి తీసుకుంటూ ఉంటారు. సబ్జా గింజల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టడం వల్ల వాటి పరిమాణం పెరగడంతో పాటు తెల్లగా మారిపోతాయి. ఇలా నానబెట్టిన సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సబ్జా గింజలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో దోహదపడుతుంది. అలాగే ప్రేగుల కదలికలను పెంచడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఇవి దివ్యౌషధంగా పని చేస్తాయి. సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తం శుద్ది అవుతుంది. మూత్రపిండాల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. మూత్రపిండాలు శుభ్రం అవుతాయి.
అంతేకాకుండా సబ్జా గింజల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. సబ్జా గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ఒత్తిడి మరియు ఆందోళన అలాగే జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడే వారు సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే చాలా మంది సబ్జా గింజలను వేసవికాలంలో మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ వీటిని ఏ కాలంలోనైనా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా సబ్జా గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.