Green Tea : మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు సమస్య బారిన పడే వారు రోజు రోజుకూ ఎక్కువవుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీటితోపాటు మనల్ని అధిక బరువు సమస్య నుండి బయటపడేయడంలో గ్రీన్ టీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ గ్రీన్ టీ ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడంతోపాటు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గ్రీన్ టీ ని తాగడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ ని కామెలియా సినెసిస్ అనే ఆకు నుండి తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ ఆయుర్వేదంలో ఈ ఆకును ఎంతోకాలం నుండి ఉపయోగిస్తున్నారు. కానీ దీనికి ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం లభించింది. ప్రతి రోజూ గ్రీన్ టీ ని తాగడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి వేగంగా బరువు తగ్గుతారు. గ్రీన్ టీ లో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకు పోయిన హానికారక కణాలను బయటకు పంపిస్తాయి.
గ్రీన్ టీ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ వైరల్ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటారు. రోజూ గ్రీన్ టీ ని తాగడం వల్ల రక్తంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. గ్రీన్ టీ ని తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. గ్రీన్ టీ లో క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణాలు కూడా ఉంటాయి. గ్రీన్ టీ ని తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ తాగే వారిలో వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి. వయస్సు పైబడడం వల్ల వచ్చే ముడతలను తగ్గించి యవ్వనంగా కనబడేలా చేయడంలో కూడా గ్రీన్ టీ మనకు సహాయపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు తరచూ గ్రీన్ టీ ని తాగుతూ ఉండడం వల్ల కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి. అలాగే ఈ టీ ని తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా సమస్య కూడా తగ్గుతుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే కదా దీనిని రోజుకు నాలుగైదు కప్పులు తాగకూడదు. దీనిని ఎక్కువగా తాగడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు ఈ గ్రీన్ టీ కి దూరంగా ఉండడమే మంచిది. గ్రీన్ టీ లో కెఫిన్ ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు గ్రీన్ టీ ని ఎక్కువగా తాగితే సమస్య మరింత పెరుగుతుంది. అలాగే దీనిని భోజనానికి ముందు తీసుకోకూడదు. భోజనానికి అరగంట నుండి 45 నిమిషాల ముందు తాగాలి. ఈ విధంగా గ్రీన్ టీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.