Chickpeas Sprouts : ప్రస్తుత కాలంలో వస్తున్న అనేక అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి చాలా మంది మొలకెత్తిన గింజలను తింటున్నారు. వైద్యులు కూడా వీటిని తినమని అందరికీ సూచిస్తున్నారు. మనకు అందుబాటులో ఉండే అన్ని రకాల పప్పు దినుసులను మొలకెత్తించి ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. వీటిలో క్యాలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువుతో బాధపడుతున్న వారు మొలకెత్తిన గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మొలకెత్తిన గింజలను కొద్ది పరిమాణంలో తీసుకోగానే మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. దీంతో మనం బరువు త్వరగా తగ్గవచ్చు. తరచూ మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తరుచూ ఇన్ ఫెక్షన్ ల బారిన పడే వారు మొలకెత్తిన గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి6 , విటమిన్ కె లతోపాటు ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, క్యాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, జింక్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
అంతేకాకుండా వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. మొలకెత్తిన గింజలను తినడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. మొలకెత్తిన గింజల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని, జుట్టును, గోర్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. రోజూ మొలకెత్తిన గింజలను తినడం వల్ల నాడీ మండలం పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.
మొలకెత్తిన గింజలను తినడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయి. అలర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు మొలకెత్తిన గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటికి క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తి కూడా ఉంటుంది. కనుక మొలకెత్తిన గింజలను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాం. గర్భిణీలు రోజూ మొలకెత్తిన గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు పుష్కలంగా పోషకాలు అంది శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక మొలకెత్తిన గింజలను తగిన పరిమాణంలో తీసుకుని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.