Gongura Flower Tea : మనకు సులభంగా లభించే ఆకుకూరల్లో గోంగూర ఒకటి. దీన్ని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గోంగూరతో చాలా మంది పచ్చడి, పప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే గోంగూర మొక్కలకు పూసే గోంగూర పువ్వులు కూడా మనకు ఎన్నో లాభాలను అందిస్తాయి. వీటినే గోగు పువ్వులు అంటారు. వీటిల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే ఈ పూలలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇంకా అనేక పోషకాలు ఈ పువ్వులలో ఉంటాయి. కనుక వీటిని కూడా తరచూ తినాలి. అయితే ఇవి నేరుగా తినేందుకు అంత రుచిగా ఉండవు. కానీ వీటితో టీ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మనకు పోషకాలను, ప్రయోజనాలను అందిస్తుంది. ఇక గోగు పువ్వులతో టీ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పువ్వులతో టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండిన గోంగూర పువ్వులు – ఆరు, నీళ్లు – రెండు కప్పులు, తేనె – రెండు టేబుల్ స్పూన్లు.
గోంగూర పువ్వుల టీని తయారు చేసే విధానం..
నీళ్లను బాగా మరిగించి అందులో గోంగూర పువ్వుల రెక్కలను వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి గిన్నె మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు పూలలోని సారమంతా నీళ్లలోకి చేరుతుంది. ఆ తరువాత వడకట్టాలి. చివరకు అందులో తేనె కలపాలి. దీంతో గోంగూర పువ్వుల టీ తయారవుతుంది. దీన్ని గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి. చల్లగా కావాలనుకుంటే గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి తాగవచ్చు. ఇలా గోంగూర పువ్వులతో టీని తయారు చేసి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని రోజుకు ఒకసారి తాగవచ్చు.