భారతీయులందరి ఇళ్లలోనూ ధనియాలు వంట ఇంటి సామగ్రిలో ఉంటాయి. వీటిని రోజూ వంటల్లో వేస్తుంటారు. ధనియాల పొడిని చాలా మంది వాడుతుంటారు. దీని వల్ల వంటలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే ధనియాల్లో నిజానికి అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మన శరీరానికి అవసరం అయ్యే ముఖ్యమైన పోషకాలు వీటిల్లో ఉంటాయి. విటమిన్లు ఎ, సి, కె లు ధనియాల్లో ఉంటాయి. అందువల్ల ధనియాలను రోజూ తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ధనియాలను నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రోజుకు 1, 2 కప్పుల ధనియాల నీళ్లను తాగవచ్చు. ఆ నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని ధనియాలను వేసి బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక స్టవ్ ఆర్పి నీటిని వడకట్టాలి. అనంతరం అందులో అవసరం అనుకుంటే తేనె, నిమ్మరసం కలపవచ్చు. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తాగాలి. దీంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
1. పైన తెలిపిన విధంగా ధనియాల నీటిని తయారు చేసుకుని తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
2. శరీరంలో ఎక్కువ నీరు చేరిన వారు ధనియాల నీటిని తాగితే శరీరంలో ఉండే నీరు బయటకు పోతుంది. శరీరం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
3. ధనియాల నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి.
4. ధనియాల నీటిని తాగడం వల్ల వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని వేడి తగ్గుతుంది.
5. ముఖం ఉబ్బిపోయే సమస్య ఉన్నవారు ధనియాల నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
6. ధనియాల నీటిని తాగడం వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.