Beetroot Juice : మన ఆరోగ్యానికి మేలు చేసే దుంపలలో బీట్ రూట్ ఒకటి. బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బీట్ రూట్ ను తిన్నప్పుడు నాలుకతో పటుగా మూత్రం, మలం కూడా పింక్ రంగులో రావడాన్ని మనం చూడవచ్చు. విటమిన్స్, మినరల్స్ ను అధికంగా కలిగి ఉన్న వాటిల్లో బీట్ రూట్ ఒకటి. రక్తహీనతను, మలబద్దకాన్ని, ఫైల్స్ తోపాటు మూత్రాశయ, పిత్తాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో బీట్ రూట్ ఎంతగానో సహాయపడుతుంది.
శరీరంలో వాపులను, హైబీపీని, కాలేయ సంబంధిత వ్యాధులను కూడా బీట్ రూట్ తగ్గిస్తుంది. మనలో కొందరు బీట్‌రూట్ ను ముక్కలుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ బీట్‌రూట్ జ్యూస్ ను మరింత రుచిగా, అందరూ ఇష్టపడే విధంగా ఎలా తయారు చేసుకోవాలి, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బీట్‌రూట్ – 2 (మధ్యస్థంగా ఉన్నవి), నిమ్మరసం – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – పావు టీ స్పూన్, తేనె – 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒకటిన్నర గ్లాసు.
బీట్‌రూట్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా బీట్‌రూట్ పై ఉండే చెక్కును తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో బీట్‌రూట్ ముక్కలను, ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమంలో నీళ్లను పోసి శుభ్రమైన వస్త్రం లేదా జల్లి గంట సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టగా వచ్చిన జ్యూస్ లో నిమ్మరసం, తేనెలను వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్‌రూట్ జ్యూస్ తయారవుతుంది. ఇందులో తేనెకు బదులుగా పంచదారను కూడా వాడుకోవచ్చు. బీట్ రూట్ జ్యూస్ ను ఇలా తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
బీట్‌రూట్ జ్యూస్ ను ఇలా తయారు చేసుకుని రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే.. హైబీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ, లివర్ శుభ్రంగా మారుతాయి. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు బీట్‌రూట్ జ్యూస్ వల్ల కలుగుతాయి. కనుక దీన్ని రోజూ తాగాలి.