Lemon Juice : వేసవి తాపం నుండి బయట పడడానికి మనం ఎక్కువగా మార్కెట్ లో దొరికే శీతల పానీయాలను ఆశ్రయిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుంది. వీటిని తాగడం వల్ల షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా దంతక్షయం, కాలేయం, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కనుక మనం ఇంట్లోనే జ్యూస్‌లను తయారు చేసుకుని తాగడం మంచిది.
తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎంతో రుచిగా తయారు చేసుకునే జ్యూస్ లలో లెమన్ జ్యూస్ ఒకటి. నిమ్మకాయలతో చేసే ఈ జ్యూస్ చాలా రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి ఎటువంటి హానిని కలిగించదు. ఎంతో రుచిగా లెమన్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ జ్యూస్ తయారీ విధానం..
నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – పావు టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – అర టేబుల్ స్పూన్, చక్కెర – 3 టేబుల్ స్పూన్స్, చల్లని నీళ్లు – 300 ఎంఎల్, ఐస్ క్యూబ్స్ – 4 లేదా 5.
లెమన్ జ్యూస్ తయారీ విధానం..
ఒక గ్లాసులో లేదా బాటిల్ లో ఐస్ క్యూబ్స్ తప్ప పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి 10 నుండి 15 సెకన్ల వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా చల్లదనం కావాలనుకునే వారు ఐస్ క్యూబ్స్ ను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ జ్యూస్ తయారవుతుంది. వేసవి తాపాన్ని తగ్గించడంలో ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.