Coconut Dosa : కొబ్బరిని చాలా మంది తరచూ వంటల్లో వేస్తుంటారు. దీని తురుమును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే కొబ్బరితో దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. కొబ్బరిలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొబ్బరిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కొబ్బరి దోశలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇక వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, కొబ్బరి తురుము – పావు కప్పు, ఉప్పు – సరిపడా.
కొబ్బరి దోశ తయారీ విధానం..
బియ్యాన్ని కడిగి మూడు గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొబ్బరి తురుము వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోయాలి. పాన్ మీద నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు పాన్ అంతా పరుచుకునేలా దోశ వేయాలి. మధ్య మధ్యలో ఖాళీలు ఉంటే వాటిల్లోనూ పిండి వేయాలి. దీన్ని తక్కువ మంట మీద నిమిషం పాటు కాల్చాలి. బాగా కాలిన తరువాత నాలుగు మడతలు వేసి తీయాలి. దీంతో ఎంతో రుచికరమైన కొబ్బరిదోశ తయారవుతుంది. అయితే పిండిలో కాస్త కొత్తిమీర, పుదీనా, టమాటా, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వంటివి వేస్తే.. ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న దోశలను టమాటా చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.