Sweet Ragi Java : మనం చిరు ధాన్యాలయిన రాగులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని అందరికీ తెలుసు. ప్రస్తుత కాలంలో వీటిని ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. రాగులను పిండి చేసి మనం ఉప్మా, జావ, ఇడ్లీ, రోటీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. రాగి పిండితో ఎక్కువగా మనం జావను చేసుకుని తాగుతూ ఉంటాం.
నీరసంగా ఉన్నప్పుడు, ఏదైనా జబ్బు బారిన పడినప్పుడు, శరీరంలో వేడి అధికంగా ఉన్నప్పుడు రాగి జావను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మనం ఎక్కువగా రాగి జావను నేరుగా లేదా దాంట్లో మజ్జిగను కలుపుకుని తాగుతూ ఉంటాం. అంతేకాకుండా రాగి జావలో మనం పంచదారను లేదా బెల్లాన్ని వేసుకుని తియ్యగా కూడా చేసుకుని తాగవచ్చు. తియ్యని రాగి జావను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తియ్యని రాగి జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 200 ఎంఎల్, ఉప్పు – చిటికెడు, పంచదార లేదా బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు లేదా గోరు వెచ్చని పాలు – 100 ఎంఎల్.
తియ్యని రాగి జావ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీళ్లను పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతుండగానే ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న రాగి పిండిని, ఉప్పును వేయాలి. ఈ మిశ్రమాన్ని కలుపుతూ 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించుకోవాలి.
తరువాత పంచదారను లేదా బెల్లం తురుమును వేసి కలుపుతూ మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. తరువాత పాలను పోసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల తీపి రాగి జావ తయారువుతుంది. దీనిని అందరూ ఇష్టంగా తాగుతారు. ఈ రాగి జావను తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఇలా రాగి జావను చేసుకుని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.