Pudina Lassi : మనం సాధారణంగా పెరుగుతో రకరకాల లస్సీలను తయారు చేసుకొని తాగుతూ ఉంటాం. చల్లగా తాగే ఈ లస్సీలు మనల్ని వేసవి తాపం నుండి బయట పడేయడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. లస్సీని తాగడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
లస్సీలో ఉండే ప్రోబయాటిక్స్ శరీరానికి మేలు చేసే బాక్టీరియా పరిమాణాన్ని పెంచుతాయి. బరువు తగ్గడంలో కూడా పెరుగుతో చేసే ఈ లస్సీ ఉపయోగపడుతుంది. ఈ లస్సీని వివిధ రకాలుగా తయారు చేసుకుని తాగవచ్చు. అందులో పుదీనా లస్సీ ఒకటి. పుదీనా లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలను, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, పుదీనా ఆకులు – గుప్పెడు, ఉప్పు – రుచికి సరిపడా, ఐస్ క్యూబ్స్ – తగినన్ని.
పుదీనా లస్సీ తయారీ విధానం..
ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో లేదా బ్లెండర్ లో పెరుగును, పుదీనా ఆకులను, రుచికి సరిపడా ఉప్పును, తగినన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని గ్లాసులో పోసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే పుదీనా లస్సీ తయారవుతుంది. ఈ లస్సీలో ఐస్ క్యూబ్స్ వేయడానికి బదులుగా ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా అయిన తరువాత కూడా తాగవచ్చు. పుదీనా లస్సీలో తీపిని ఇష్టపడే వారు పంచదార లేదా తేనెను వేసుకోవచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి చలువ చేయడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది.