Ganji : మనం ప్రతి రోజూ అన్నాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అన్నం ఉడికిన తరువాత ఎక్కువగా ఉన్న నీటిని వార్చుతారు. దీనినే గంజి లేదా అన్న రసం అంటారు. గంజిని ఎక్కువగా పూర్వకాలంలో ఆహారంగా తీసుకునే వారు. ఉదయం పూట గంజి నీటిని అల్పాహారంగా తీసుకునే వారు. అలాగే అంబలిని కూడా ఆహారంగా తీసుకునే వారు. ఇప్పటికీ దీనిని ఆహారంగా తీసుకునే వారు ఉన్నారు. ప్రస్తుత కాలంలో కుక్కర్ ల పుణ్యమా అని అన్నాన్ని వార్చడమే మానేశారు. ఒకవేళ అన్నాన్ని వార్చి గంజిని తీసినప్పటికీ దానిని పడబోస్తున్నారు.
కానీ గంజి నీటిలో కూడా పోషకాలు ఉంటాయని దీనిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గంజి నీటిలో శరీరానికి కావల్సి అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అమైనో యాసిడ్లు గ్లూకోజ్ కంటే ఎక్కువగా త్వరగా శక్తిని ఇస్తాయి. గంజిని తాగడం వల్ల కండరాలకు మేలు కలుగుతుంది. ఒక గ్లాస్ గంజి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి తాగడం వల్ల డయేరియా సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.
జుట్టంతటికీ గంజి నీటిని పట్టించి అర గంట తరువాత తలస్నానం చేయడం వల్ల జుట్టు కాంతివంతంగా, ఒత్తుగా, బలంగా మారుతుంది. గంజిని తాగడం వల్ల కడుపులో మంటను, అసిడిటీని తగ్గించుకోవచ్చు. గంజిని వేడిగా, చల్లారిన తరువాత కూడా తీసుకోవచ్చు. రాత్రి వండిన అన్నాన్ని వార్చిన గంజిలోనే వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజూ ఉదయం త్వరగా ఈ అన్నాన్ని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిని తినడం వల్ల పైత్య వికారాలు, తాపం, దప్పిక, మూత్ర దోషాలు, అధిక వేడి తగ్గుతాయి.
నూలు వస్త్రాలను గట్టిగా మార్చడానికి కూడా గంజిని ఉపయోగిస్తారు. నూలు వస్త్రాలను ఉతికి గంజి నీటిలో కొద్ది సేపు ఉంచి తరువాత ఎండలో ఆర వేస్తారు. ఆరిన తరువాత ఈ వస్త్రాలను ఇస్త్రీ చేసుకోవడం వల్ల నూలు వస్త్రాలు చక్కగా ఉంటాయి. గంజి పొడి మనకు బయట దొరుకుతుండడం వల్ల దీని వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. గంజిని ఇష్టంగా తాగే వారు కూడా ఉన్నారు. చైనాలో గంజిని రైస్ సూప్ గా పిలుస్తారు. దాదాపు ఆసియా దేశాల వారందరూ గంజిని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అందువల్ల మనం కూడా గంజిని తరచూ తాగుతుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.