Tamarind Leaves : చింత చిగురు.. ఇది మనందరికీ తెలిసిందే. చింత చెట్టుకు చిగురించే లేత చింత ఆకులనే చింత చిగురు అంటారు. అన్ని చెట్లు ఆకు రాల్చే కాలంలో వాటి ఆకులన్నీ రాలిపోతాయి. అదే విధంగా చింత చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. దాని తరువాత ఆ స్థానంలో లేత చిగురులు వస్తాయి. ఈ చిగుళ్లను సేకరించి కూరల్లో వేసుకుంటారు. చింత చిగురు రుచికి పుల్లగా ఉంటుంది. చింత చిగురును కూడా మనం ఆకుకూరగా తీసుకుంటూ ఉంటాం. చింత పండుకు బదులుగా పులుపు కోసం చింత చిగురును ఉపయోగిస్తూ ఉంటారు.
చింత చిగురును ఎండబెట్టి పొడిగా చేస్తారు. ఇలా తయారు చేసుకున్న పొడిని వంటల్లో ఉపయోగిస్తారు. చింత చిగురును కంది పప్పుతో కలిపి పొడి కూరగా కూడా వండుకుని తింటారు. చింత చిగురును ఆహారంగా తీసుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చింత చిగురును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గతుంది. కామెర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా చింత చిగురుకు ఉంటుంది. చింత చిగురు రసంలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గుతుంది.
చింత చిగురును తీసుకోవడం వల్ల శరీరంలో వాతం ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా మూల వ్యాధుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. చింత చిగురును ఉడికించి ఈ నీటిని చర్మంలోకి ఇంకేలా రాయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చింత చిగురే కాకుండా చింత పువ్వును కూడా ఆహారంగా తీసుకుంటారు. దీనితో కూడా పప్పు, పచ్చడి వంటి వాటిని తయారు చేస్తారు. ఫిలిఫైన్స్ లో చింత ఆకులతో చేసిన టీ ని మలేరియా జ్వరానికి వైద్యంగా ఉపయోగిస్తారు.
చింత చిగురును తీసుకోవడం వల్ల థైరాయిడ్ ను నియంత్రిస్తుందని, రక్తాన్ని శుద్ధి చేస్తుందని తాజాగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల ద్వారా రుజువైంది. చింత చిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజసిద్ధమైన లాక్సేటివ్ గా పని చేస్తుంది. సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం ఉండదు. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండడంతో చెడు కొవ్వును తగ్గించి మంచి కొవ్వును పెంచడంలో సహాయకారి అవుతుంది. చింత చిగురులో యాంటి ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.
చింత చిగురును ఉడికించిన నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతునొప్పి, గొంతు మంట, గొంతు వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో నులి పురుగులు ఉన్న వారికి చింత చిగురు వేసి చేసిన వంటలను ఇవ్వడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. ఇది జీర్ణాశయ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. చింత చిగురును తీసుకోవడం వల్ల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
చింత చిగురును ఎక్కువగా తీసుకునే వారిలో ఎముకలు దృఢంగా ఉంటాయని ఒక ఆరోగ్య సర్వే ద్వారా తెలిసింది. గుండె జబ్బులను తగ్గించడం, శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడం వంటి లక్షణాలు కూడా చింత చిగురులో ఉన్నాయి. కనుక చింత చిగురు లభించినప్పుడు దానిని వీలైనంత ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలని, సహజసిద్ధంగా లభించే ఈ చింత చిగురును తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.