Avise Ginjala Karam Podi : ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలలో అవిసె గింజలు ఒకటి. అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అవిసె గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయి. బీపీని తగ్గించడంలో, షుగర్ ను నియంత్రణలో ఉంచడంలో అవిసె గింజలు ఎంతో సహాయపడతాయి. శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వు (ఎల్‌డిఎల్) స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
అవిసె గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో త్వరగా ఆకలిగా అనిపించక.. మనం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాము. కనుక మనం బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక అవిసె గింజలతో కారం పొడిని తయారు చేసుకుని అన్నంలో మొదటి ముద్దలో కలిపి తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ క్రమంలోనే అవిసె గింజల కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
అవిసె గింజలు – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 15 నుండి 20, కరివేపాకు – 2 రెండు రెబ్బలు, చింతపండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 6, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్.
అవిసె గింజల కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో అవిసె గింజలను వేసి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి ఉప్పు తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి వేయించుకొని చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో ముందుగా వేయించిన అవిసె గింజలను వేసి మెత్తని పొడిలా చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో ముందుగా వేయించిన ఎండు మిరపకాయల మిశ్రమంతోపాటు తగినంత ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడిని వేసి అంతా కలిసేలా మరో సారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా అవిసె గింజల కారం పొడి తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు లేదా ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా కలిపి తినవచ్చు. దీంతో ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.