Goru Chikkudu Kaya Vepudu : మనలో చాలా మంది గోరు చిక్కుడు కాయలను తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ గోరు చిక్కుడు కాయలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోరు చిక్కుడు కాయలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుడుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. షుగర్ వ్యాధిని, బీపీని నియంత్రించడంలో గోరు చిక్కుడు కాయలు ఎంతగానో సహాయపడతాయి. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, జీర్ణ క్రియను మెరుగుపరచడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. అయితే గోరు చిక్కుడు కాయలను ఉపయోగించి మనం అనేక రకాల కూరలను వండుకోవచ్చు. వాటిల్లో గోరుచిక్కుడు కాయ వేపుడు ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సరిగ్గా చేయాలేకానీ ఇష్టం లేని వారు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇక గోరు చిక్కుడు కాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు చిక్కుడు కాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన గోరు చిక్కుడు కాయలు – పావు కిలో, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 4, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – 2 టీ గ్లాసులు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె- 2 టేబుల్ స్పూన్స్, మినప పప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చి మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్.
గోరు చిక్కుడు కాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో తరిగిన గోరు చిక్కుడు కాయలు, అర టీ స్పూన్ ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత గోరు చిక్కుడులోని నీరు అంతా పోయేలా చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో పల్లీలు, ధనియాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి. ఒక జార్ లో ఇలా వేయించిన వాటితోపాటు ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా మిగిలిన ఉప్పును వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడు కాయలను వేసి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడు కాయ వేపుడు తయారవుతుంది. గోరు చిక్కుడు కాయలను ఉడికించడం వల్ల ఇందులో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. ఈ వేపుడును అన్నం, చపాతీ, రోటి, రాటి సంగటి వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.