Ragi Cake : ఓవెన్‌తో ప‌నిలేకుండానే.. రుచిక‌ర‌మైన రాగి పిండి కేక్‌ను ఇలా త‌యారు చేయండి..!

Ragi Cake : రాగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో రాగి జావ చేసుకుని తాగితే శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు రాగుల వ‌ల్ల క‌లుగుతాయి. అయితే రాగుల‌తో కేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. పైగా ఆరోగ్య‌క‌రం కూడా. దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Ragi Cake very delicious and healthy here it is how to make it
Ragi Cake

రాగి పిండి కేక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రాగి పిండి – ముప్పావు క‌ప్పు, బెల్లం – ముప్పావు క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, నూనె – పావు క‌ప్పు, గోధుమ పిండి – పావు క‌ప్పు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, బేకింగ్ పౌడ‌ర్ – ఒక టీ స్పూన్, పాలు – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్స్.

రాగి పిండి కేక్ త‌యారీ విధానం..

ముందుగా పెరుగును తీసుకుని పెరుగులో ఉండే నీరు అంతా పోయేలా చేసుకోవాలి. త‌రువాత‌ ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు పోసి చిన్న మంట‌పై బెల్లం పూర్తిగా క‌లిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం క‌రిగిన త‌రువాత జ‌ల్లి గంట స‌హాయంతో వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బెల్లం నీటిలో ఉండే మలినాలు తొల‌గిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు లేకుండా చేసుకున్న పెరుగును తీసుకుని గ‌డ్డ‌లు లేకుండా మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత నూనె వేసి క‌లుపుకోవాలి. ఆ త‌రువాత ముందుగా క‌రిగించి పెట్టుకున్న బెల్లం నీటిని వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకిండ్ పౌడ‌ర్ ను వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని పాల‌ను పోసి క‌లుపుకోవాలి. ఒక గిన్నెకు నెయ్యిని రాసి, నెయ్యిపై మైదా పిండి లేదా గోధుమ పిండి ని చ‌ల్లుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కేక్ గిన్నెకు అంటుకు పోకుండా ఉంటుంది.

ఈ గిన్నెలోకి ముందుగా క‌లిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్ర‌మాన్ని వేసి గాలి బుడ‌గ‌లు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో స్టాండ్ లేదా ప్లేట్ ను ఉంచి, గిన్నెపై మూత పెట్టి 10 నిమిషాల పాటు గిన్నెను వేడి చేయాలి. గిన్నె వేడి అయిన త‌రువాత రాగి పిండి మిశ్ర‌మాన్ని ఉంచిన గిన్నెను అందులో ఉంచి మూత పెట్టి చిన్న మంట‌పై 30 నుండి 35 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కేక్ పూర్తిగా ఉడ‌క‌క పోతే మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఒక చాకు తో గిన్నె నుండి కేక్ ను వేరు చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న కేక్ ను కావ‌ల్సిన ప‌రిమాణంలో ముక్క‌లుగా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి పిండి కేక్ త‌యార‌వుతుంది. ఈ కేక్ ను ఓవెన్ లో కూడా ఉడికించుకోవ‌చ్చు. ఈ కేక్ త‌యారీలో పెరుగుకు బ‌దులుగా గుడ్డును కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇలా రాగి పిండితో కేక్ ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు.

D

Recent Posts