Bellam Annam : మనం వంటింట్లో బెల్లాన్ని ఉపయోగించి అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. తీపి పదార్థాల తయారీలో పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బెల్లంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, మలబద్దకాన్ని తగ్గించడంలో బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.
శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంలో కూడా బెల్లం సహాయపడుతుంది. బెల్లాన్ని ఉపయోగించి చేసే తీపి వంటకాలలో బెల్లం అన్నం కూడా ఒకటి. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బెల్లం అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, బెల్లం తురుము – ఒకటిన్నర కప్పు లేదా రుచికి తగినంత, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 4 కప్పులు, పాలు – 2 కప్పులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు ద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – పావు టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
బెల్లం అన్నం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీడిపప్పును, ఎండు ద్రాక్షను కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం, శనగపప్పును వేసి కడిగి నీళ్లను, పాలను పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బియ్యం మెత్తగా ఉడికిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుకొబ్బరి ముక్కలను, డ్రై ఫ్రూట్స్ ను, బెల్లాన్ని వేసి బెల్లం కరిగే వరకు బాగా కలపాలి. తరువాత ఉప్పును, యాలకుల పొడిని వేసి మరో సారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం అన్నం తయారువుతుంది. తీపి తినాలనిపించినప్పుడు చాలా సులువుగా తయారయ్యే బెల్లం అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.