Thotakura Vepudu : తోట‌కూర అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Thotakura Vepudu : మ‌నం వేపుడు చేసుకోవ‌డానికి వీలుగా ఉండే ఆకుకూర‌ల‌ల్లో తోట‌కూర కూడా ఒక‌టి. ఇత‌ర ఆకుకూర‌ల లాగా తోట‌కూర కూడా ఎన్నో ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. తోట‌కూర‌లో విట‌మిన్ ఎ, విటమిన్ సి, విట‌మిన్ కెల‌తోపాటు మాంగ‌నీస్, ఐర‌న్, కాప‌ర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ప‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ తోట‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడును త‌యారు చేస్తూ ఉంటాం. స‌రిగ్గా వండాలే కానీ తోట‌కూర వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. చాలా సులువుగా, రుచిగా తోట‌కూర వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తోట‌కూర వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన తోట‌కూర – 3 క‌ట్టలు, ఉప్పు – త‌గినంత‌, ఎండుమిర‌ప‌కాయ‌లు – 4 లేదా రుచికి త‌గిన‌న్ని, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నూనె – ఒక టేబుల్ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, మిన‌ప ప‌ప్పు – అర టీ స్పూన్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1.

make Thotakura Vepudu in this method very tasty
Thotakura Vepudu

తోట‌కూర వేపుడు త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో తోట‌కూర‌ను, కొద్దిగా ఉప్పును, ఒక చిన్న గ్లాసు నీళ్ల‌ను పోసి మూత‌పెట్టి తోట‌కూర మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. తోట‌కూర ఉడికిన త‌రువాత అందులో ఉన్న నీరు అంతా పోయేలా వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా ఉడికించిన తోట‌కూర కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత దానిలో ఉండే నీరు అంతా పోయేలా చేత్తో పిండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల తోట‌కూర ప‌స‌రు వాస‌న రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక జార్ లో ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, రుచికి త‌గినంత మ‌రికొద్దిగా ఉప్పును వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌న‌ ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు గింజ‌ల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి వేగిన త‌రువాత క‌రివేపాకును, ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ఎండు మిర‌ప‌కాయ‌ల మిశ్ర‌మాన్ని వేసి క‌లపాలి. ఇప్పుడు ముందుగానీరు లేకుండా చేసిపెట్టుకున్న తోట‌కూర‌ను వేసి క‌లిపి 2 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే తోట‌కూర వేపుడు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉండ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది.

D

Recent Posts