Tomato Pickle : మనం వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో టమాటాలు కూడా ఒకటి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటాలను మనం ఎక్కువగా ఇతర కూరగాయలతో కలిపి వండుతూ ఉంటాం. లేదా పప్పును తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా టమాటాలతో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. టమాట పచ్చడి రుచి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభమే. టమాట నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట నిల్వ పచ్చడి తయారీ విధానం..
టమాటాలు – ఒక కేజీ, నూనె – 4 టేబుల్ స్పూన్స్, శుభ్రంగా ఉన్న చింతపండు – 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు -ఒక టీ స్పూన్, కారం – తగినంత, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 6 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండు మిరపకాయలు -4, కరివేపాకు – గుప్పెడు.
టమాట నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత టమాట ముక్కలను వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి చింతపండును కూడా వేసి కలిపి టమాటాలలోని నీరు అంతా పోయి టమాట ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు ఉంచాలి. ఒక కళాయిలో ఆవాలను, మెంతులను వేసి వేయించి చల్లగా అయిన తరువాత జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను, ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాట ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను వేసి తాళింసు చేసుకోవాలి.
తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి చిన్న మంటపై బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి తయారీకి పండిన టమాటాలను తీసుకుంటే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. దీనిని తడి లేని మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ టమాట పచ్చడిని నెయ్యి వేసి కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.