Bellam Sunnundalu : బెల్లం సున్నుండ‌ల త‌యారీ ఇలా.. రోజుకు ఒక‌టి తింటే ఎంతో బ‌లం.. ఆరోగ్య‌క‌రం..

Bellam Sunnundalu : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప ప‌ప్పు కూడా ఒక‌టి. మిన‌ప ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మిన‌ప ప‌ప్పుతో వివిధ ర‌కాల అల్పాహారాల‌తోపాటు వివిధ ర‌కాల తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప ప‌ప్పుతో చేసే తీపి ప‌దార్థాలు అన‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి సున్నుండ‌లు. సున్నుండ‌లు ఎంత రుచిగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలుసు. సాధార‌ణంగా సున్నుండ‌ల‌ను పంచ‌దార‌తో త‌యారు చేస్తూ ఉంటారు. కేవ‌లం పంచ‌దార‌తోనే కాకుండా బెల్లంతో కూడా మ‌నం సున్నుండ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లంతో చేసే సున్నుండ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. త‌క్కువ స‌మ‌యంలోనే సుల‌భంగా, రుచిగా బెల్లంతో సున్నుండ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం సున్నుండ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప‌గుళ్లు – 300 గ్రాములు, పొట్టు మిన‌ప గుళ్లు – 100 గ్రాములు, బెల్లం తురుము – 400 గ్రాములు, క‌రిగిన నెయ్యి – త‌గినంత‌.

Bellam Sunnundalu very healthy eat daily one
Bellam Sunnundalu

బెల్లం సున్నుండ‌ల త‌యారీ విధానం..

ముందుగా మిన‌ప‌గుళ్ల‌ను తీసుకుని ఒక క‌ళాయిలో వేసి చిన్న మంట‌పై రంగు మారే వ‌ర‌కు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే క‌ళాయిలో పొట్టు మిన‌ప‌గుళ్ల‌ను కూడా వేసి చిన్న మంట‌పై రంగు మారే వ‌ర‌కు వేయించుకుని మిన‌ప‌గుళ్ల‌ను ఉంచిన ప్లేట్ లోకి తీసుకుని అన్నింటినీ క‌ల‌పాలి. త‌రువాత వీటిని కొద్దిగా కొద్దిగా ఒక జార్ లోకి తీసుకుంటూ మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా బ‌ర‌క‌గా ఉండేలా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇలా మిన‌ప‌గుళ్ల‌న‌న్నింటిని మిక్సీ ప‌ట్టుకున్న త‌రువాత ఆ పొడిలో బెల్లం తురుమును వేసి బాగా క‌ల‌పాలి. ఇలా బెల్లంతురుమును వేసి క‌లిపిన మిశ్ర‌మాన్ని మ‌ర‌లా జార్ లో వేసుకుంటూ మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో మూడు నుండి నాలుగు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటూ కొద్ది కొద్దిగా క‌లుపుకుంటూ కావ‌ల్సిన ప‌రిమాణంలో ఉండ‌లుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం సున్నుండ‌లు త‌యార‌వుతాయి. వీటిని త‌డి లేని డ‌బ్బాలో నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని రోజుకు ఒక‌టి చొప్పున తిన్నా కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పిల్ల‌ల‌కు ఈ సున్నుండ‌ల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారు పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల సున్నుండ‌ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి.

D

Recent Posts