Guava Leaves : ప్రస్తుత కాలంలో ముఖంపై మొటిమల సమస్యతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. వాతావరణ కాలుష్యం, జిడ్డు చర్మం, మానసిక ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత వంటి వాటిని ముఖంపై మొటిమలు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. ముఖంపై ఈ మొటిమలు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ మొటిమలను నివారించడానికి ఎంతో ధర ఉండే క్రీములను, పేస్ వాష్ లను ఉపయోగిస్తూ ఉంటాం. ఎటువంటి ఖర్చు లేకుండా చర్మానికి హాని కలగకుండా ఈ మొటిమలను మనం తగ్గించుకోవచ్చు. మొటిమలను తగ్గించడంలో మనకు మన ఇళ్లల్లో ఉండే జామ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.
జామ ఆకులను తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి లేపనంగా రాసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మొటిమలు తగ్గుతాయి. జామ చెట్టు నుండి వచ్చే జామ కాయలను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కేవలం జామ కాయలే కాకుండా జామ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులు, పువ్వులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి.
నోటి పూత, నోట్లో పుండ్లు వంటి సమస్యలతో బాధపడే వారు జామ ఆకులను నమలడం వల్ల లేదా జామ ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం ద్వారా నోటి పూతతోపాటు చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా నయం అవుతాయి. జామ ఆకులను తినడం వల్ల లేదా జామ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరగడంతోపాటు రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండె చురుకుగా పని చేస్తుంది. ఈ ఆకుల కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
జామ ఆకులను పేస్ట్ గా చేసి అందులో పసుపును కలిపి లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకలి లేమితో బాధపడే వారు జామ ఆకులను పేస్ట్ గా చేసి ఆ మిశ్రమానికి ఉప్పును, అర టీ స్పూన్ జీలకర్రను కలిపి ఈ మిశ్రమాన్నంతటినీ వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. జామ చెట్టు బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జామ చెట్టు బెరడు కషాయాన్ని కానీ చూర్ణాన్ని కానీ తీసుకోవడం వల్ల మలద్వారం చుట్టూ దురద, వాంతులు, విరేచనాలు, స్వప్న స్కలనాలు, రక్త మొలలు, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
జామ పువ్వులను మెత్తగా నూరి కళ్లు మూసుకుని కళ్లపై రాసుకోవడం వల్ల కళ్ల కలక, కళ్ల నుండి నీళ్లు కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడే వారు జామ ఆకులకు ఆముదాన్ని రాసి వేడి చేసి నొప్పులు, వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. జామ ఆకుల కషాయాన్ని జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. కేవలం మొటిమల సమస్యనే కాకుండా మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో జామ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.