Cabbage Green Peas Curry : మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. దీన్ని తినేందుకు కొందరు ఇష్టపడరు. వాస్తవానికి క్యాబేజీ అందించే ప్రయోజనాలు అద్భుతమైనవి. వీటిల్లో మాంసాహారాలకు సమానమైన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కనుక క్యాబేజీని తరచూ తినాలి. ఇక దీంతో పచ్చి బఠాణీలను కలిపి వండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక క్యాబేజీ పచ్చి బఠాణీల కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ పచ్చి బఠాణీల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా తరిగిన క్యాబేజీ – రెండు కప్పులు, పచ్చి మిర్చి – మూడు, నానబెట్టిన పచ్చి బఠాణీ – అర కప్పు, అల్లం పేస్ట్ – అర టీస్పూన్, ఉప్పు – తగినంత, ఆవాలు – అర టీస్పూన్, కరివేపాకు – నాలుగు రెబ్బలు, పసుపు – కొద్దిగా, నూనె – రెండు టీస్పూన్లు.
క్యాబేజీ పచ్చి బఠాణీల కూరను తయారు చేసే విధానం..
పాన్‌లో నూనె వేసి వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం పేస్ట్, పసుపు ఒకటి తరువాత ఒకటి వేసి వేయించాలి. తరువాత క్యాబేజీ, పచ్చి బఠాణీలను వేసి చిన్న అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టాలి. సన్నని మంటపై 15 నిమిషాలు ఉడికించి గరిటెతో కలపాలి. ఇప్పుడు ఉప్పు కలిపి మళ్లీ మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించి ఆపేయాలి. దీనిపై తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు. సిమ్‌లో పెట్టి వండడం వల్ల క్యాబేజీ వేగడంతోపాటు స్టీమ్ అవుతుంది. దీని వల్ల పోషక విలువలు పోకుండా ఉంటాయి. క్యాబేజీకి స్వతహాగా ఉండే వాసన కూడా తగ్గుతుంది. ఈ కూరను అన్నం లేదా చపాతీ దేంట్లో తిన్నా సరే రుచిగా ఉంటుంది. మనకు పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు రెండూ లభిస్తాయి.