Drumstick Flowers : మనం ఆహారంగా తీసుకోవడంతోపాటు.. అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో మునగ చెట్టు కూడా ఒకటి. మునగ చెట్టు గరించి ప్రతి ఒక్కరికీ తెలుసు. దీనిలో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. శరీరంలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాల మీద మునగాకు రసం ఒక టానిక్ లా పని చేస్తుంది. పురుషులకు వచ్చే అనేక రకాల సంతానలేమి సమస్యలను తగ్గించడంలో మునగ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది.
మునక్కాయలను చారు, సాంబార్ వంటి వాటి తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. మునగాకుతో కారాన్ని చేసుకుని తింటూ ఉంటాం. వంటల్లో కూడా మునగాకును ఉపయోగిస్తూ ఉంటారు. మునగాకు, మునక్కాయలే కాకుండా మునగ చెట్టు పువ్వులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని పప్పుగా చేసుకుని తినవచ్చు. మునగ పువ్వుతో పప్పును చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మునగ పువ్వుతో పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కుక్కర్ లో నూనెను వేసి నూనె కాగిన తరువాత మినప పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కచ్చా పచ్చగా చేసిన వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పసుపు, తగినంత కారం పొడిని వేసి కలిపి శుభ్రంగా కడిగి ఉంచుకున్న మునగాకును, మునగ చెట్టు పువ్వులను, తగినంత ఉప్పును వేసి కలపాలి. ఇవి పూర్తిగా వేగిన తరువాత కడిగిన పెసరపప్పును వేసి కలిపి మూత పెట్టి వేయించాలి. చివర్లో కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మునగ పువ్వు పప్పు కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో తింటే రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
ఇలా మునగపువ్వుతో కూరను చేసుకుని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయి.