Mouth Ulcer : మనం అప్పుడప్పుడు నోటిలో పుండ్లు, నోటిలో చిన్న చిన్న కురుపులు, నోటి పూత, నాలుకకు రెండు పక్కలా ఎర్రగా అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇవి ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. నోటి పూత సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎటువంటి ఆహారాన్ని కూడా తీసుకోలేం. నోటి పూత, నోటిలో పుండ్లు, కురుపులు వంటివి తగ్గడానికి వారం నుండి పదిరోజుల సమయం పడుతుంది. ఈ సమస్యల నుండి బయట పడడానికి కొందరు ఆయింట్ మెంట్లను వాడుతూ ఉంటారు. వీటిని వాడే అవసరం లేకుండానే ఇంటి చిట్కాలను ఉపయోగించే త్వరగా వీటి నుండి ఉపశమనం పొందవచ్చు.
నోటి పూత, నోటిలో పుండ్లు, కురుపులు వంటివి వచ్చినప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో రెండు స్పూన్ల తేనెను కలిపి తాగడం వల్ల నోటి పూత తగ్గుతుంది. పుండ్లు, కురుపులు వంటి వాటి మీద నెయ్యి లేదా వెన్నను రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నోటిలో కురుపులు, పుండ్లు తగ్గుతాయి.
తులసి చెట్టు లేత ఆకులను తీసుకుని బాగా నమిలి ఈ పిప్పిని పుండ్లకు, కురుపులకు తగిలేలా నోట్లో ఉంచుకోవడం వల్ల వీటి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. జామ చెట్టు ఆకులను, బంతి చెట్టు ఆకులను కూడా ఈ విధంగా నమిలి రసాన్ని, పిప్పిని పుండ్లకు, కురుపులకు తగిలేలా ఉంచుకోవడం వల్ల కూడా నోటి పూత, నోటిలో కురుపులు, పుండ్లు త్వరగా తగ్గుతాయి.
వీటితోపాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటూ, తగినంత సమయం నిద్రపోవడం వల్ల ఎటువంటి ఆయింట్ మెంట్లు వాడే అవసరం లేకుండానే నోటిపూత, నోటిలో అల్సర్లు, నోటిలో పుండ్లు వంటి సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు.